తెలంగాణలోనూ ఆ నగరాల పేర్లు మారుస్తారట..: బిజెపి మేనిఫెస్టోలో కీలక ఆంశాలివేనట...
నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రచార జోరు పెంచేందుకు సిద్దమైన బిజెపి అంతకంటేముందే మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించింది.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచార జోరు పెంచాయి. ఇక పోలింగ్ ముగిసేవరకు ప్రజల్లోనే వుండేలా అన్నిపార్టీల నాయకులు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా ప్రజల్లోకి వెళ్లడానికి ముందే పార్టీ మేనిఫెస్టోను ప్రకటించడానికి బిజెపి సిద్దమయ్యింది. నవంబర్ 16న తమ మేనిఫెస్టోను ప్రకటించనున్నట్లు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేసారు.
ఇప్పటికే బిజెపి పాలిత రాష్ట్రాల్లో వివిధ నగరాలు, ప్రాంతాల పేర్లను మారుస్తున్న విషయం తెలిసిందే. ఇలాగే తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చాక పలు నగరాల పేర్లను మార్చే ఆలోచనలో బిజెపి వుందని... ఇదే విషయాన్ని మేనిఫెస్టోలో పొందుపర్చినట్లు సమాచారం. అలాగే నిరుపేదలకు కూడా విద్యా, వైద్యం అందుబాటులోకి తెస్తామన్న హామీని బిజెపి ఇవ్వనుందట. నిరుద్యోగ యువతకు ప్రతి ఏడాది ఉద్యోగాలు కల్పించేలా జాబ్ క్యాలెండర్, ఉపాధి అవకాశాలు కల్పించేలా బిజెపి మేనిఫెస్టోలో హామీలు వుండనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే ఇప్పటికే తెలంగాణలో బిజెపి పెద్దల ప్రచారం మొదలయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు ప్రచారం చేపట్టారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో ఆయా రాష్ట్రాల్లోనే బిజెపి కేంద్ర నాయకత్వం ప్రచారం నిర్వహిస్తోంది. అక్కడ పోలింగ్ ముగిసిన తర్వాత చివరిదశలో తెలంగాణ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ కు ముందు బిజెపి కేంద్ర నాయకత్వం మొత్తం తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Read More బిజెపికి తుల ఉమా రాజీనామా.. నేడు బీఆర్ఎస్ లో చేరిక..!
ఇక ఇప్పటికే తెలంగాణలో బిజెపి, జనసేన పొత్తు ఖరారయి సీట్లపంపకం కూడా జరిగింది. జనసేన 8 సీట్లను కేటాయించిన బిజెపి 111 చోట్ల తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. దీంతో జనసేనాని పవన్ కల్యాణ్ ను కూడా ప్రచారంలో దింపాలని బిజెపి భావిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రా సెటిలర్లు,మెగా అభిమానులు ఎక్కువగా వున్న నియోజకవర్గాల్లో పవన్ తో ప్రచారం చేయించాలని తెలంగాణ బిజెపి నాయకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని పలు నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా వున్నారు. ఇలా కర్ణాటక ప్రాంతానికి చెందినవారు ఎక్కువగా వుంటే కర్ణాటక నాయకులతో, మహారాష్ట్ర ప్రజలు ఎక్కువగా వుండే ప్రాంతాల్లో మరాఠా నాయకులు, నార్త్ ఇండియన్స్ ఎక్కువగా వుండే ప్రాంతాల్లో కేంద్ర నాయకులు ప్రచారం చేపట్టేలా బిజెపి ప్లాన్ చేసింది. ఇలా పక్కా ప్లాన్ తో బిజెపి చాపకింద నీరులా ప్రచారం చేపట్టేందుకు సిద్దమయ్యింది.