తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023: బెల్లంపల్లిలో శ్రీదేవికి షాకిచ్చిన బీజేపీ, మూడు స్థానాల్లో మార్పులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 111 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది.ఈ ఎన్నికల్లో జనసేనతో పొత్తుతో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. జనసేనకు ఎనిమిది స్థానాలను బీజేపీ కేటాయించింది.
హైదరాబాద్: నామినేషన్ల దాఖలు చేయడానికి చివరి రోజున మూడు స్థానాల్లో మార్పులతో భారతీయ జనతా పార్టీ తుది జాబితాను విడుదల చేసింది. శుక్రవారంనాడు భారతీయ జనతా పార్టీ 14 మందితో చివరి జాబితాను విడుదల చేసింది. ఈ తుది జాబితాలో బీజేపీ నాయకత్వం మూడు మార్పులు చేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది.ఈ ఎన్నికల్లో జనసేన పార్టీకి బీజేపీ ఎనిమిది అసెంబ్లీ స్థానాలను కేటాయించింది. ఈ ఎనిమిది అసెంబ్లీ స్థానాలు మినహాయించి మిగిలిన స్థానాల్లో బీజేపీ నాయకత్వం అభ్యర్థులను ప్రకటించింది.
గతంలో బీజేపీ విడుదల చేసిన జాబితాలో చాంద్రాయణగుట్ట నుండి సత్యనారాయణకు భారతీయ జనతా పార్టీ టిక్కెట్టు కేటాయించింది. అనారోగ్య కారణాలతో పోటీ చేయవద్దని సత్యనారాయణ నిర్ణయం తీసుకున్నారు.ఈ విషయమై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఇటీవల లేఖ రాశారు. దీంతో చాంద్రాయణగుట్ట అసెంబ్లీ స్థానంలో సత్యనారాయణకు బదులుగా కె.మహేందర్ కు బీజేపీ నాయకత్వం టిక్కెట్టు కేటాయించింది.
గతంలో తెలంగాణ ఆర్ టీసీ లో ఆశ్వథామ రెడ్డి కీలక నేతగా ఉన్నారు. ఆశ్వథామ రెడ్డికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం గత జాబితాలో టిక్కెట్టు కేటాయించింది. కానీ, ఆర్ధిక కారణాలతో ఈ ఎన్నికల్లో పోటీ చేయవద్దని ఆశ్వథామ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీంతో వనపర్తిలో కూడ అభ్యర్థిని మార్చాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయం మేరకు అనుగ్నారెడ్డికి ఆ పార్టీ టిక్కెట్టు కేటాయించింది.
బెల్లంపల్లి అసెంబ్లీ స్థానంలో తొలుత శ్రీదేవికి బీజేపీ నాయకత్వం టిక్కెట్టు కేటాయించింది. శ్రీదేవి నిన్ననే నామినేషన్ దాఖలు చేశారు. శ్రీదేవికి టిక్కెట్టు కేటాయించడంతో ఏమాజీ నేతృత్వంలోని ఆయన వర్గీయులు భారతీయ జనతాపార్టీ కార్యాలయంలో ఆందోళనకు దిగారు.ఈ విషయమై బీజేపీ నాయకత్వం పునరాలోచనలో పడింది.ఈ విషయమై క్షేత్రస్థాయి నుండి నివేదికను తెప్పించుకుని అభ్యర్థిని మార్చాలని నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలోనే శ్రీదేవికి బదులుగా ఏమాజీని బరిలోకి దింపింది బీజేపీ.
also read:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023: చివరి జాబితా విడుదల చేసిన బీజేపీ, చోటు దక్కింది వీరికే
నిన్ననే నామినేషన్ దాఖలు చేసిన శ్రీదేవిని కాకుండా ఏమాజీని బరిలోకి దింపింది. దీంతో శ్రీదేవి ఎలా స్పందిస్తారో చూడాలి. తనకు కాకుండా మరొకరికి టిక్కెట్టు కేటాయింపు విషయమై శ్రీదేవి ఎలా స్పందిస్తారోనని అంతా ఉత్కంఠగా చూస్తున్నారు.