తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023: చివరి జాబితా విడుదల చేసిన బీజేపీ, చోటు దక్కింది వీరికే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి.ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలను మినహాయించి ఇతర స్థానాలను బీజేపీ ప్రకటించింది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ శుక్రవారం నాడు 14 మందితో జాబితాను విడుదల చేసింది.ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. ఈ పొత్తులో జనసేనకు కేటాయించిన స్థానాలను మినహాయించి మిగిలిన స్థానాల్లో అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది.
బీజేపీ చివరి జాబితాలో చోటు దక్కింది వీరికే
1. బెల్లంపల్లి- కొయ్యల ఏమాజీ
2.పెద్దపల్లి- దుగ్యాల ప్రదీప్
3.సంగారెడ్డి-దేశ్‌పాండే రాజేశ్వర్ రావు
4.మేడ్చల్-ఏనుగు సుదర్శన్ రెడ్డి
5.మల్కాజిగిరి-ఎన్. రామచంద్రరావు
6.శేరిలింగంపల్లి-రవికుమార్ యాదవ్
7.నాంపల్లి-రాహుల్ చంద్రా
8.చాంద్రాయణగుట్ట-కె.మహేందర్
9.కంటోన్మెంట్- గణేష్ నారాయణ్
10.దేవరకద్ర-కొండా ప్రశాంత్ రెడ్డి
11.వనపర్తి- అనుగ్నారెడ్డి
12.ఆలంపూర్-మేరమ్మ
13.నర్సంపేట-పుల్లారావు
14.మధిర-పేరంపల్లి విజయరాజు
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. ఈ పొత్తు నేపథ్యంలో జనసేనకు బీజేపీ ఎనిమిది అసెంబ్లీ సీట్లను కేటాయించింది. ఈ ఎనిమిది అసెంబ్లీ సీట్లలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను జనసేన ఇప్పటికే ప్రకటించింది.
ఇదిలా ఉంటే శేరిలింగంపల్లి అసెంబ్లీ సీటు కోసం బీజేపీ,జనసేనలు పట్టుబట్టాయి.అయితే చివరకు శేరిలింగంపల్లి అసెంబ్లీ సీటును బీజేపీ తీసుకుంది. ఈ స్థానం నుండి రవికుమార్ యాదవ్ ను బీజేపీ బరిలోకి దింపింది.
ఇదిలా ఉంటే వనపర్తి అసెంబ్లీ స్థానంలో గత జాబితాలో ఆశ్వథామ రెడ్డికి బీజేపీ నాయకత్వం టికెట్టు కేటాయించింది. అయితే కొన్ని కారణాలతో ఆశ్వథామ రెడ్డి పోటీ చేయడానికి వెనుకంజ వేసినట్టుగా సమాచారం. దీంతో ఆశ్వథామరెడ్డి స్థానంలో అనుగ్నారెడ్డికి బీజేపీ నాయకత్వం టిక్కెట్టు కేటాయించింది. గతంలో చాంద్రాయణగుట్ట అసెంబ్లీ స్థానం నుండి టిక్కెట్టు దక్కించుకున్న అభ్యర్ధి సత్యనారాయణ కూడ పోటీ చేయడానికి ఆసక్తిని చూపలేదు. దీంతో చాంద్రాయణగుట్ట సత్యనారాయణ స్థానంలో కె.మహేందర్ కు బీజేపీ నాయకత్వం టిక్కెట్టును కేటాయించింది.
బెల్లంపల్లిలో అమురాజుల శ్రీదేవికి బదులుగా ఏమాజీకి బీజేపీ నాయకత్వం టిక్కెట్టు కేటాయించింది. నిన్ననే శ్రీదేవి నామినేషన్ దాఖలు చేసింది. నామినేషన్ దాకలు చేసిన మరునాడే ఆ స్థానంలో మరొకరికి బీజేపీ టిక్కెట్టు కేటాయించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ నాయకత్వం పట్టుదలగా ఉంది. దీంతో తెలంగాణ రాష్ట్రంపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ ను పెంచింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం గత కొంత కాలంగా బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.