Barrelakka : నవతరం మహాత్మా గాంధీ బర్రెలక్కే... పవన్ కల్యాణ్ కంటే చాలా బెటర్ : రాంగోపాల్ వర్మ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బర్రెలక్కను మహాత్మాగాంధీతో పోల్చారు ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. పవన్ కల్యాణ్ కంటే ఆమె చాలా బెటర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
హైదరాబాద్ : తెలంగాణలో ప్రస్తుతం 'బర్రెలక్క' ఓ సంచలనం. కేసీఆర్, బండి సంజయ్, రేవంత్ రెడ్డి, కేటీఆర్, హరీష్... ఇలా రాజకీయాల్లో తలలుపండిన వారు పోటీచేస్తున్న ఎన్నికల్లోనే కర్నే శిరీష్ అలియాస్ బర్రెలక్క పోటీచేస్తోంది. ఎలాంటి పొలిటికల్ బ్యాగ్రౌండ్ లేని ఈమె పేరు పైన పేర్కొన్న నాయకులతో సమానంగా వినిపిస్తోంది. సామాన్యురాలిగానే ఎన్నికల బరిలో దిగిన బర్రెలక్క ఇప్పుడు అసామాన్యురాలిగా మారింది. రోజురోజుకు ఆమెకు పెరుగుతున్న క్రేజ్, మద్దతు చూసి ప్రధాన పార్టీల్లో గుబులు మొదలయ్యింది. మాజీ ఐపిఎస్ జేడి లక్ష్మీనారాయణ, ఒకప్పటి హీరో, ప్రస్తుతం మతబోధకుడు రాజా, యానాంకు చెందిన ప్రముఖ రాజకీయ మల్లాడి కృష్ణారావు వంటివారు బర్రెలక్కకు ఇప్పటికే మద్దతు తెలిపారు. తాజాగా వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ బర్రెలక్కపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
బర్రెలక్క నేటి మహాత్మాగాంధీ... మహాత్ముడి లాగే అన్యాయానికి వ్యతిరేకంగానే బర్రెలక్క పోరాటం కూడా ప్రారంభమయ్యిందని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. ఈమెను చూస్తుంటే పవన్ కల్యాణ్ కంటే సీరియస్ గా రాజకీయాలు చేస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు. ఇలా పవన్ తెలంగాణ ఎన్నికల ప్రచారంపై స్పందిస్తూ శిరీష్ పై ప్రశంసలు కురిపించారు వర్మ.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడమే ఆసక్తి లేదన్నట్లుగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రచారం సాగుతోందని రాంగోపాల్ వర్మ అన్నారు. బిజెపి-జనసేన పొత్తులో భాగంగా తాండూరులో జనసేన పోటీ చేస్తోంది... ఈ క్రమంలోనే పవన్ అక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారానికి సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికన షేర్ చేసిన వర్మ ఎంత నిర్లక్ష్యంగా సాగిందో చూడండి అంటూ కామెంట్ చేసారు.
పవన్ కల్యాణ్ ఇలా ప్రచారం చేయడం తానెప్పుడు చూడలేదని వర్మ అన్నారు. మాట్లాడేటప్పుడు కనీసం మైక్ లో సౌండ్ సరిగ్గా వస్తుందోలేదో... ప్రజలకు అర్థం అవుతుందో లేదో పవన్ గానీచ నిర్వహకులు గానీ పట్టించుకోలేదన్నారు. ఇలా పవన్ ప్రచారం చూసాక ఆయనకంటే బర్రెలక్క ప్రచారమే చాలా గొప్పగా సాగుతోందని రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేసారు.
Read More K Chandrashekar Rao : బిఆర్ఎస్ అధినేతకు ఈసీ షాక్...ప్రగతిభవన్ కు నోటీసులు జారీ
తెలంగాణలో నిరుద్యోగంపై చేసిన ఒక్క రీల్ కర్నె శిరీషను కాస్త బర్రెలక్కను చేసింది. డిగ్రీలు చదివి ఉద్యోగాలు రాక ఇలా బర్రెలు మేపుకుంటున్నానని శిరీష బిఆర్ఎస్ ప్రభుత్వానికి చురకలు అంటిస్తూ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియో చేసినందుకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత కోల్పోయిన ఆమె ఏకంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల బరిలో దిగారు. కొల్లాపూర్ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు బర్రెలక్క.