Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 66.09 శాతం పోలింగ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి పోలింగ్ శాతం తగ్గిపోయింది. గతంలో కంటే తక్కువగా 66.09 శాతం పోలింగ్ నమోదైంది. గతంలో సరైన పోలింగ్ శాతాన్ని మరుసటి రోజున ఈసీ ప్రకటించిన విషయాన్ని కూడా మరువలేం. ఈ సారి ఇప్పటి వరకైతే పోలింగ్ శాతం 66.09 శాతం అని తెలిసింది.
హైదరాబాద్: తెలంగాణలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ముగిసింది. ఈ ఎన్నికల్లో 66.09 శాతం పోలింగ్ నమోదైంది. ఓటింగ్ ముగియడంతో సిబ్బంది ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. 2018లో 73.7 శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడం గమనార్హం. ఎప్పటిలాగే రాజధాని నగరం హైదరాబాద్‌లో తక్కువగా పోలింగ్ నమోదైంది. ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోలింగ్ రోజునే సరైన పోలింగ్ శాతం వెలువడలేదు. మరుసటి రోజున ఎన్నికల సంఘం సరైన పోలింగ్ శాతాన్ని ప్రకటించింది.
సాధారణంగా ప్రభుత్వంపై వ్యతిరేకత అధికంగా ఉంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదు అవుతుందని విశ్లేషకులు చెబుతుంటారు. నిజానికి 2018లో దీనికి భిన్నంగా జరిగింది. 2014లో 69 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. కానీ, 2014 కంటే 2018లోనే బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలను గెలుచుకోగలిగింది. ఆ లెక్కనే ఈ సారి కూడా బీఆర్ఎస్ మరిన్ని స్థానాలను గెలచుకుంటుందా? అధికార పార్టీ చెప్పినట్టుగా సెంచరీకి చేరువలో సీట్లు వస్తాయా? అనేది తేలాలంటే వేచి చూడాల్సిందే.
Also Read: Exit Polls: 2018లో సరిగ్గా అంచనా వేసిన సర్వే ఇప్పుడేం చెబుతున్నది?
ఈ సారి గతంలో కంటే పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. కానీ, ఎగ్జిట్ పోల్స్ మాత్రం ప్రతిపక్ష కాంగ్రెస్‌కు సానుకూలంగా అంచనాలు వెలువరించాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అధికంగా పోలై.. అధికార పార్టీ పక్షం వాళ్లైనా ఓటు వేయడానికి నిరాశతో వెనుకడుగు వేశారా? అనే కోణంలో చర్చ జరుగుతున్నది. ఎగ్జిట్ పోల్స్ కేవలం అంచనాలు మాత్రమే. వాస్తవ ఫలితాలు డిసెంబర్ 3వ తేదీన వెలువడతాయి.