Chandrababu: రేవంత్ రెడ్డితో చంద్రబాబుకు పెద్ద చిక్కే వచ్చిందిగా! ఆలోచించే టైం లేదు.. నిర్ణయమే ముఖ్యం
రేవంత్ రెడ్డి తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సహా పలువురిని ఆహ్వానించారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీతొ వైసీపీ, టీడీపీ సన్నిహితంగా మెలగాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సీఎం ప్రమాణ కార్యక్రమానికి వీరు వస్తారా? రారా? అనేది తేలాల్సి ఉన్నది.
హైదరాబాద్: రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం 1.04 గంటలకు ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన అందరినీ ఆహ్వానించారు. రాష్ట్ర ప్రజలు, సంస్థలు, సంఘాలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలకు ఆహ్వానం పలికారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఏపీ సీఎం వైఎస్ జగన్‌తోపాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని, రాజస్తాన్, ఛత్తీస్‌గడ్ మాజీ సీఎంలను రమ్మన్నారు. కేసీఆర్‌కూ ఆహ్వానం పలికారు. అయితే, ఎక్కువ గడువు ఇవ్వకుండా ఆహ్వానం పలకడంతో పనులు సర్దుబాటు కాక పలువురు ప్రముఖులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
మిగితా వారిని పక్కనపెడితే ఎక్కువ మంది, ముఖ్యంగా తెలుగు ప్రజలు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తారా? వచ్చి ఇద్దరూ ఒక వేదికను పంచుకుంటారా? చంద్రబాబు నాయుడికి ఇచ్చిన గౌరవమే జగన్‌కూ రేవంత్ రెడ్డి ఇస్తారా? అనే అంశాలను ఉత్కంఠగా పరిశీలించజూస్తున్నారు.
Also Read: Vote Share: కమ్యూనిస్టులు బీజేపీని ఎదుర్కోగలరా? మూడు అసెంబ్లీ ఎన్నికలు మనకు చెప్పే పాఠం ఏమిటీ?
తెలంగాణ విడిపోయాక ఇక్కడ టీడీపీ డ్యామేజీ కావడం, రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిపోవడం వంటి పరిణామాల తర్వాత చంద్రబాబు నాయుడితో బహిరంగ వేదికపై రేవంత్ రెడ్డి కలిసిన సందర్భాలు లేవు. పార్టీ మారినా చంద్రబాబు నాయుడిపట్ల రేవంత్‌కు అమిత గౌరవం ఉన్నట్టు తెలుస్తున్నది. తెలంగాణలో టీడీపీ శ్రేణులు చాలా వరకు కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేశాయి. రేవంత్ రెడ్డిపై చంద్రబాబు నాయుడికీ గౌరవం ఉన్నది. అయితే, రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరుపై అనిశ్చితే ఉన్నది.
కాంగ్రెస్ విజయం, రేవంత్ రెడ్డి సీఎం కావడం ఉభయ రాష్ట్రాల్లోని టీడీపీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. దాన్ని అలాగే కొనసాగించడానికి, ఏపీలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లోనూ రేవంత్ రెడ్డి సానుకూలంగా వ్యవహరించేలా ఉండటానికి చంద్రబాబు నాయుడు ఈ సమావేశానికి రావాల్సి ఉంటుంది.
Also Read: CM Revanth Reddy: రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం చెక్.. కేసీ వేణుగోపాల్ సంచలన స్టేట్‌మెంట్
రేవంత్ రెడ్డి.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన మాట వాస్తవమే కానీ, ఆయన ఉన్న పార్టీ కాంగ్రెస్. టీడీపీ ఇప్పటికే ఎన్డీఏలో చేరడానికి ఆసక్తి చూపింది. ఆ తర్వాత కాంగ్రెస్ వైపూ రాలేదు. వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో ఇబ్బందులు ఉండకూడదని టీడీపీ ఆశిస్తున్నది. ఈ తరుణంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కార్యక్రమానికి వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి లేదా బీజేపీ తో వైరం పెట్టుకోవడం సముచితం కాదు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లాలా? లేదా? అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడికి చిక్కు ప్రశ్నగానే ఉన్నది. ఒక వేళ చంద్రబాబు నాయుడు రాకుంటే ఆయన తరఫున వేరొకరినైనా ఎల్బీ స్టేడియానికి పంపించే అవకాశం ఉన్నది.
ఎన్నికల ముంగిట్లో ఒక అభిప్రాయాన్ని కచ్చితంగా వెల్లడిస్తూ రేవంత్ రెడ్డి ప్రమాణం స్వీకారం కార్యక్రమంలో చేరడం కంటే తటస్థంగా దూరంగా ఉండిపోవడం ఉత్తమం అని టీడీపీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తున్నది. సమయం లేదు. రేపు మధ్యాహ్నమే కార్యక్రమం కాబట్టి, టీడీపీ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది.
ఇక వైఎస్ జగన్ కూడా హాజరయ్యే అవకాశాలు తక్కువే. కాంగ్రెస్‌తో ఆయనకు ఉన్న వైరం ఒకటైతే.. కేంద్ర ప్రభుత్వానికి అగెనెస్ట్‌గా వెళ్లాల్సి వస్తున్నదని జగన్ కూడా భావిస్తున్నట్టు సమాచారం.