Revanth Reddy: రేవంత్ రెడ్డికి 2004లో కేసీఆర్ టీఆర్ఎస్ టికెట్ ఇచ్చి ఉంటే..!
రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టినప్పుడు టీఆర్ఎస్‌లో చేరారు. సుమారు మూడేళ్లపాటు కల్వకుర్తి నుంచి పోటీ చేయడానికి టీఆర్ఎస్ టికెట్ కోసం వేచి చూశారు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ టికెట్ కేటాయించలేదు. నిరాశతో రేవంత్ రెడ్డి బయటకు వచ్చి స్వతంత్రంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి విజయఢంకా మోగించారు. అప్పటి నుంచి ఆయన వెనక్కి చూసుకోకుండా ఎదుగుతూ వచ్చారు.
హైదరాబాద్: తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక ఫైర్ బ్రాండ్. రాజకీయాల్లో సాధారణ స్థాయి నుంచి సీఎం సీటు పదవి వరకు ఎదిగిన మెరుపు. తెలంగాణలో కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా రేవంత్ రెడ్డినే చూశారు. కేసీఆర్ వద్దనుకుంటే ఆయన ప్రభావం ఉండని, ఢీ అంటే ఢీ అని నిలవగలిగిన నేత ఎవరని చూస్తే ఓటర్లకు రేవంత్ రెడ్డినే కనిపించారు. కానీ, ఒకప్పుడు సీఎం కేసీఆర్ నిర్ణయం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూసి ఆశావహుడు రేవంత్ రెడ్డి. 2004లో కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకుని ఉంటే ఈ రోజు రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్‌కు ఇంత పెద్దటి సవాలై నిలిచేవాడు కాదేమో!
రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం వైవిద్యంగా ఉన్నది. కేసీఆర్ నిర్ణయం కోసం ఎదురుచూసి ఆయననే పక్కకు నెట్టి సీఎం సీటును కైవసం చేసే వరకు ఎదిగారు. బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీలో పని చేసి ఆ పార్టీకి బద్దశత్రువైన కాంగ్రెస్‌ను విజయ తీరాలకు చేర్చారు.
1992లో రేవంత్ రెడ్డి ఏబీవీపీలో క్రియాశీలకంగా పని చేశారు. రాజకీయాలపై మక్కువతో తొలుత టీడీపీలో చేరినా.. బయటకు వచ్చి టీఆర్ఎస్(ఇప్పుడు బీఆర్ఎస్)లో చేరారు. టీఆర్ఎస్‌లో 2001 నుంచి 2002 కాలంలో చేరారు. టీఆర్ఎస్‌లో 2004లో కల్వకుర్తి టికెట్ కోసం ఆశించారు. ఎంతో ఎదరుచూసినా.. సుమారు మూడేళ్లు దాని కోసం వేచి చూసినా కేసీఆర్ రేవంత్ రెడ్డిని మన్నించలేదు. టీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో రేవంత్ రెడ్డి తన రాజకీయ మార్గాన్ని కొంత మార్చుకున్నారు.
Also Read : తెలంగాణలో కాంగ్రెస్‌తోపాటు బీఆర్ఎస్ కూడా గెలిచింది!!
టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి 2008లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్రుడిగా నిలబడి గెలిచారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. టీడీపీ అవకాశం ఇవ్వకున్నా ఇండిపెండెంట్‌గా గెలవడంతో చంద్రబాబు దృష్టిలో పడ్డారు. ఆ తర్వాత 2009, 2014లలో కొడంగల్ నుంచి టీడీపీ టికెట్ పై పోటీ చేసి గెలిచారు. తర్వాత 2017లో కాంగ్రెస్‌లో చేరారు. అతి వేగంగా పార్టీలో ఎదిగారు. స్తబ్దుగా ఉన్న పార్టీని ఆయన టీపీసీసీ చీఫ్‌గా పరుగు పెట్టించారు. ఇప్పుడు సీఎం క్యాండిడేట్‌గా ఉన్నారు.
Also Read : Kothagudem Election Results 2023:తెలంగాణ అసెంబ్లీలో మరోసారి కమ్యూనిస్టు గళం
2004లో ఒక వేళ కేసీఆర్ గనుక రేవంత్ రెడ్డికి కల్వకుర్తికి టికెట్ ఇస్తే ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉండేవి. ఆయన బహుశా టీఆర్ఎస్‌లో కీలక స్థాయికి వెళ్లేవారు. నిజానికి కేసీఆర్ టికెట్ ఇచ్చినా ఆ పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న స్థాయికి రేవంత్ రెడ్డి వెళ్లే అవకాశాలు ఉండేవి కావు. ముఖ్యంగా పార్టీ చీఫ్‌గా అవకాశం రాకపోయేది. సీఎం అభ్యర్థి అనే ఊసు ఉండేది కాదు. అప్పుడు కల్వకుర్తి టికెట్ అందలేదని రేవంత్ రెడ్డి బాధపడి ఉండొచ్చు. కానీ, అది పరోక్షంగా ఆయనకు మంచే చేసింది. రెట్టించి పని చేశాడు. సవాళ్లను స్వీకరించి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.