Kothagudem Election Results 2023:తెలంగాణ అసెంబ్లీలో మరోసారి కమ్యూనిస్టు ఎమ్మెల్యే
తెలంగాణ శాసన సభలోకి మరోసారి వామపక్ష నేత అడుగుపెట్టబోతున్నారు. 2014లో సీపీఐ, సీపీఎం ఎమ్మెల్యేలు శాసన సభలో ఉండగా.. 2018లో వామపక్ష నేతలు అసెంబ్లీలోకి వెళ్లలేదు. ఈసారి మళ్లీ సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి గెలిచి అసెంబ్లీకి వెళ్లనున్నారు.
హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ అసెంబ్లీలోకి వామపక్ష నేత అడుగు పెట్టబోతున్నారు. కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటును సీపీఐకి కాంగ్రెస్ కేటాయించింది. ఈ సీటులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని బరిలో దిగారు. కూనంనేనికి మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు నిలిచాయి.
కూనంనేని సాంబశివరావుకు 80,336 ఓట్లు పోలయ్యాయి. 26,547 ఓట్ల మార్జిన్‌తో కూనంనేని సాంబశివరావు ఘన విజయం సాధించారు. దీంతో ఈ సారి తెలంగాణ అసెంబ్లీలోకి సీపీఐ ఎమ్మెల్యే అడుగు పెట్టనున్నారు. అదే.. కాంగ్రెస్‌తో పొత్తు చర్చలు వికటించి సీపీఎం సొంతంగా పోటీకి దిగింది. 19 స్థానాల్లో పోటీ చేసి పరాజయాన్ని మూటగట్టుకుంది.
2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వామపక్షాల నుంచి ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకొండ నియోజకవర్గంలో సీపీఐ నుంచి రవీంద్ర కుమార్ గెలుపొందారు. ఆయన తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014లోనే భద్రాచలం నుంచి సీపీఎం నేత సున్నం రాజయ్య శాసన సభకు వెళ్లారు. వీరిద్దరూ అసెంబ్లీలో కొనసాగారు. మళ్లీ 2018లో వామపక్షాల నుంచి ప్రాతినిధ్యం శాసన సభలో లేకుండా పోయింది. ఈ సారి మళ్లీ 2023 ఎన్నికల్లో సీపీఐ నుంచి కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు గెలిచి అసెంబ్లీకి వెళ్లుతున్నారు.