అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై దాడి: నిందితుడి గుర్తింపు
మూడు రోజుల వ్యవధిలోనే అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై రెండో దఫా దాడి జరిగింది.అయితే రెండోసారి దాడి చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు.
అచ్చంపేట: అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు.మతిస్థిమితం లేని పర్వతాలు అనే వ్యక్తి ఎమ్మెల్యే బాలరాజుపై ఇటుక రాయితో దాడి చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.
ఈ నెల 13వ తేదీ రాత్రి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎన్నిల ప్రచారంలో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి దాడికి దిగారు.ఈ నెల 11వ తేదీన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై దాడి జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని గువ్వల బాలరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.తనపై కాంగ్రెస్ అభ్యర్ధి చిక్కుడు వంశీకృష్ణ స్వయంగా తనపై దాడి చేశారని గువ్వల బాలరాజు ఆరోపించారు.
బీఆర్ఎస్ నేతలు కారులో నగదును తరలిస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉప్పునుంతల మండలంలో కారును నిలిపివేసే ప్రయత్నం చేశారు. అయితే కారు నిలిపివేయకుండా అచ్చంపేటకు వెళ్లింది. అచ్చంపేట అంబేద్కర్ సెంటర్ వద్ద కారును కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ సమయంలో భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు గాయాలయ్యాయి. స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసి హైద్రాబాద్ అపోలో ఆసుపత్రికి గువ్వల బాలరాజును తరలించారు. గువ్వల బాలరాజు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారంనాడు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. సోమవారంనాడు అచ్చంపేటకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేరుకున్నారు.
also read:మూడు రోజుల వ్యవధిలో: అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై మరోసారి దాడి
సోమవారంనాడు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో పర్వతాలు అనే వ్యక్తి ఇటుక రాయితో దాడికి దిగాడు. ఈ సమయంలో గువ్వల బాలరాజు మోచేయికి ఇటుక రాయి తగిలింది.అయితే ఇటుక రాయి విసిరింది పర్వతాలు అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. పర్వతాలుకు మతిస్థిమితం లేదని పోలీసులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో వరుసగా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై దాడి ఘటన రాజకీయంగా కలకలం రేపింది.తనపై దాడి జరిగే అవకాశం ఉందని పోలీసుల ఉన్నతాధికారులకు పది రోజుల క్రితమే ఫిర్యాదు చేసినట్టుగా కూడ గువ్వల బాలరాజు మీడియాకు వివరించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు తమ పార్టీ అభ్యర్థులపై దాడులకు దిగుతుందని భారత రాష్ట్ర సమితి ఆరోపణలు చేస్తుంది.