మూడు రోజుల వ్యవధిలో: అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై మరోసారి దాడి
ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై వారంలో రెండోసారి దాడి జరిగింది. అచ్చంపేటలో ఎమ్మెల్యే బాలరాజుపై సోమవారంనాడు మరోసారి దాడి చోటు చేసుకుంది. గువ్వల బాలరాజుపై దాడి చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో పోలీసులున్నారు.
అచ్చంపేట: ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై సోమవారంనాడు రాత్రి అచ్చంపేటలో గుర్తు తెలియని వ్యక్తి ఇటుకను విసిరాడు. గువ్వల బాలరాజు మోచేతికి ఇటుకరాయి తగిలింది. గువ్వల బాలరాజుపై దాడి చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.
ఈ నెల 11వ తేదీన అచ్చంపేటలో గువ్వల బాలరాజుపై దాడి జరిగింది. తనపై కాంగ్రెస్ అభ్యర్ధి చిక్కుడు వంశీ కృష్ణ దాడి చేశారని గువ్వల బాలరాజు ఆరోపించారు.
భారత రాష్ట్ర సమితి నగదును పంపిణీ చేసేందుకు కారులో డబ్బును తీసుకువస్తున్నాడనే అనుమానంతో ఈ నెల 11న ఉప్పునుంతల మండలంలో కారును నిలిపివేసే ప్రయత్నం చేశారు. అయితే కారు మాత్రం ఆగలేదు. అయితే అచ్చంపేటలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఈ కారును కాంగ్రెస్ శ్రేణులు నిలిపివేశారు.ఈ కారులో నగదు ఉందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి. ఈ కారును తనిఖీ చేయాలని పోలీసులను కోరినా పోలీసులు స్పందించలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు రాళ్లతో పరస్పరం దాడికి దిగాయి. ఈ సమయంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు గాయాలయ్యాయి. అచ్చంపేటలో ప్రాథమిక చికిత్స పూర్తి చేసిన తర్వాత హైద్రాబాద్ అపోలో ఆసుపత్రిలో గువ్వల బాలరాజు చికిత్స పొందారు. ఆదివారం నాడు అపోలో ఆసుపత్రి నుండి గువ్వల బాలరాజు డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ అచ్చంపేటకు వచ్చారు. అచ్చంపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించే సమయంలో ఇటుక రాయిని గుర్తు తెలియని వ్యక్తి విసిరాడు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
also read:నాపై మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ దాడి చేశారు: ఆసుపత్రి నుండి గువ్వల బాలరాజు డిశ్చార్జ్
అచ్చంపేట సీఐపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. తనపై దాడి చేసినా కూడ దాడి చేయలేదని కాంగ్రెస్ నేతలు బుకాయించడాన్ని గువ్వల బాలరాజు తప్పుబట్టారు.గువ్వల బాలరాజుపై దాడి, కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తిపోట్ల ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఉద్దేశ్యపూర్వకంగానే తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై ఆరోపణలు చేశారు.అచ్చంపేటలో వరుస ఘటనల వెనుక కారకులు ఎవరనే విషయమై విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది.