మాదిగ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ : బీజేపీలో చేరిన మందకృష్ణ సోదరుడు
ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ సోదరుడు మంద కార్నెల్ బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆయనకు పార్టీలోకి మనస్పూర్తిగా స్వాగతం పలుకుతున్నట్లుగా ఈటల రాజేందర్ తెలిపారు
ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ సోదరుడు మంద కార్నెల్ బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. శనివారం హుజారాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కార్నెల్‌కు కాషాయ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా జాతి పడుతున్న బాధను ప్రధాని నరేంద్ర మోడీ అర్ధం చేసుకున్నారని ప్రశంసించారు. సమస్యను పరిష్కరించేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని.. బీజేపీ కండువాను కప్పుకోవడానికి మంద కార్నెల్ వరంగల్ నుంచి గజ్వేల్‌కు వచ్చారని పేర్కొన్నారు. ఆయనకు పార్టీలోకి మనస్పూర్తిగా స్వాగతం పలుకుతున్నట్లుగా ఈటల రాజేందర్ తెలిపారు.
కాగా.. మాదిగ సామాజిక వర్గానికి రిజర్వేషన్‌తో పాటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇచ్చిన హామీ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు, సదరు ప్రక్రియను వేగవంతం చేయాలని కేబినెట్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులకు మోడీ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. కాగా.. ఈ నెల 11న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన మాదిగ ఉపకులాల విశ్వరూప సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేశారు.
Also Read: మాదిగ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ : స్పీడు పెంచిన మోడీ .. కమిటీ ఏర్పాటుపై కేబినెట్ సెక్రటరీకి ఆదేశాలు
త్వరలోనే ఎస్సీ వర్గీకరణపై ఒక కమిటీ వేస్తామని ఆయన వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ కోసం చేస్తున్న పోరాటానికి తాము మద్ధతుగా వుంటామని మోడీ హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి వున్నామని .. మాదిగలకు న్యాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు.
పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో అంబేద్కర్ ఫోటో కూడా కాంగ్రెస్ పెట్టనివ్వలేదని మోడీ దుయ్యబట్టారు. అంబేద్కర్‌ను రెండుసార్లు గెలవకుండా చేసింది కాంగ్రెస్సేనని.. ఆయనకు భారతరత్న కూడా ఇవ్వలేదని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా మందకృష్ణ ఒకే లక్ష్యం కోసం పోరాడుతున్నారని మోడీ చెప్పారు. కాశీ విశ్వనాథుడి ఆశీర్వాదంతోనే తాను ప్రధానిగా మీ ముందు వున్నానని ఆయన పేర్కొన్నారు. బీజేపీ మాత్రమే అణగారిన వర్గాలకు అండగా నిలిచిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.