మాదిగ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ : స్పీడు పెంచిన మోడీ .. కమిటీ ఏర్పాటుపై కేబినెట్ సెక్రటరీకి ఆదేశాలు
మాదిగ సామాజిక వర్గానికి రిజర్వేషన్‌తో పాటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇచ్చిన హామీ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు, సదరు ప్రక్రియను వేగవంతం చేయాలని కేబినెట్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులకు మోడీ ఈరోజు ఆదేశాలు జారీ చేశారు.
మాదిగ సామాజిక వర్గానికి రిజర్వేషన్‌తో పాటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇచ్చిన హామీ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు, సదరు ప్రక్రియను వేగవంతం చేయాలని కేబినెట్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులకు మోడీ ఈరోజు ఆదేశాలు జారీ చేశారు.
కాగా.. ఈ నెల 11న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన మాదిగ ఉపకులాల విశ్వరూప సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే ఎస్సీ వర్గీకరణపై ఒక కమిటీ వేస్తామని ఆయన వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ కోసం చేస్తున్న పోరాటానికి తాము మద్ధతుగా వుంటామని మోడీ హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి వున్నామని .. మాదిగలకు న్యాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు.
పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో అంబేద్కర్ ఫోటో కూడా కాంగ్రెస్ పెట్టనివ్వలేదని మోడీ దుయ్యబట్టారు. అంబేద్కర్‌ను రెండుసార్లు గెలవకుండా చేసింది కాంగ్రెస్సేనని.. ఆయనకు భారతరత్న కూడా ఇవ్వలేదని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా మందకృష్ణ ఒకే లక్ష్యం కోసం పోరాడుతున్నారని మోడీ చెప్పారు. కాశీ విశ్వనాథుడి ఆశీర్వాదంతోనే తాను ప్రధానిగా మీ ముందు వున్నానని ఆయన పేర్కొన్నారు. బీజేపీ మాత్రమే అణగారిన వర్గాలకు అండగా నిలిచిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.
Also Read: త్వరలోనే ఎస్సీ వర్గీకరణపై కమిటీ : మాదిగల సభలో, మందకృష్ణ సమక్షంలో మోడీ సంచలన ప్రకటన
బీఆర్ఎస్ నేతల బంధువుల స్కీమ్‌గానే దళితబంధు మారిందని.. పదేళ్లుగా ఇక్కడి ప్రభుత్వం మాదిగల్ని మోసం చేసిందని మోడీ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ చరిత్ర కూడా బీసీలు, అణగారిణ వర్గాలకు వ్యతిరేకమని.. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి, ఆ హామీ నెరవేర్చలేదన్నారు.
బీజేపీ ప్రభుత్వ తొలి లక్ష్యం పేదరిక నిర్మూలన ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఆదివాసీ మహిళ అయిన ద్రౌపది ముర్మును ఓడించేందుకు కూడా కాంగ్రెస్ ప్రయత్నించిందని ఆయన ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లు రాజకీయ పార్టీలు వాగ్థానాలు చేసి, మాట తప్పినందుకు క్షమించమని అడుగుతున్నానని మోడీ వ్యాఖ్యానించారు. పదేళ్లుగా ఇక్కడి ప్రభుత్వం మాదిగల్ని మోసం చేసిందని ఆయన ఆరోపించారు. దళితబంధు వల్ల ఎంతమందికి లాభం జరిగిందని ప్రధాని ప్రశ్నించారు.
Also Read: ఈ సమాజం మమ్మల్ని మనుషులుగా చూడలేదు : మోడీ సమక్షంలో కంటతడిపెట్టిన మందకృష్ణ మాదిగ
ఇకపోతే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గాను బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలోనూ ఎస్సీ వర్గీకరణపై ఫోకస్ చేసింది . దీనిలో భాగంగా ఎస్సీల్లోని అత్యంత వెనుకబడిన వర్గాలకు సాధికారతను కల్పించేలా ఎస్సీ వర్గీకరణ చేయడంలో సహకరిస్తామని బీజేపీ హమీ ఇచ్చింది. ఈ వ్యవహారంపై మరింత ముందడుగు వేసేలా ప్రధాని మోడీ చొరవ తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మాదిగలు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌లలోని షెడ్యూల్డ్ కులాలలో పెద్ద భాగం. రిజర్వేషన్లు, ఇతరత్రా ఫలాలు తమకు అందలేదనే కారణంతో మందకృష్ణ మాదిగ సారథ్యంలోని ఎంఆర్‌పీఎస్ గత మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతోంది.