Ashok Nagar: అశోక్ నగర్ కేంద్రంగా పాలిటిక్స్.. ఇక్కడికొచ్చి కేటీఆర్ చర్చలు జరపాలి.. 4వ తేదీన వస్తానన్న మంత్రి
నిరుద్యోగుల అంశం ఇప్పుడు వేడి మీద ఉన్నది. కేటీఆర్, ఆ తర్వాత రాహుల్ గాంధీ యువతతో సమావేశమై ఉద్యోగాల భర్తీ గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ అశోక్ నగర్ వచ్చి యువతతో సమావేశం కావాలని నిరుద్యోగ సంఘాలు, ప్రతిపక్షాలు సవాల్ వేశాయి. మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. డిసెంబర్ 4వ తేదీన స్వయంగా తాను అధికారులతో కలిసి అక్కడికి వెళ్లి జాబ్ క్యాలెండర్ రూపొందిస్తామని హామీ ఇచ్చారు.
హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాద్‌లో అశోక్ నగర్‌కు ఓ ప్రత్యేకత ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కోచింగ్ సెంటర్లు, ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే నిరుద్యోగులు ఇక్కడే ఎక్కువగా ఉంటారు. రీడింగ్ రూమ్‌లు, లైబ్రరీ, హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లు ఇవే ప్రధానంగా మనకు ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు ఈ అశోక్ నగర్ రాష్ట్ర రాజకీయాలకు కేంద్రంగా మారింది.
సంక్షేమ పథకాలు, 24 గంటల కరెంట్, సాగు నీరు, గ్యారంటీల వంటి అంశాలన్నీ ప్రచారంలో హోరెత్తిపోయాయి. ఇప్పుడు నిరుద్యోగం ప్రధానంగా చర్చనీయాంశమైంది. మంత్రి కేటీఆర్ కొందరు నిరుద్యోగులతో సమావేశమై వారికి భరోసా ఇచ్చారు. ఫలితాలు వెలువడిన మరుసటి రోజే తాను అశోక్ నగర్‌కు వస్తానని, ఉద్యోగార్థులతో విస్తృత సమావేశం నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. వారి సూచనలు, సలహాలతో జాబ్ క్యాలెండర్ తయారు చేస్తామని చెప్పారు. కొన్ని రోజులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏకంగా అశోక్ నగర్‌కే వెళ్లారు. చిక్కడపల్లి లైబ్రరీలో యువతతో శనివారం రాత్రి సమావేశమై మాట్లాడారు. ఈ రెండు వార్తలూ సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.
కేటీఆర్ ఐటీ హబ్‌లో యువతతో మాట్లాడటం కాదు.. ఆయన అశోక్ నగర్‌కు వచ్చి ఇక్కడ ఉద్యోగార్థులతో సమావేశం కావాలని ప్రతిపక్షాలు, విమర్శకులు, నిరుద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి.
Also Read: Unemployment: బీఆర్ఎస్‌కు నిరుద్యోగుల సవాల్.. ఆకట్టుకుంటున్న హస్తం మ్యానిఫెస్టో.. రంగంలోకి కేటీఆర్
కాగా, ఈ రోజు మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు రాజకీయ నిరుద్యోగులని, వారి మాటలు విని యువత మోసపోవద్దని అన్నారు. వీరిద్దరూ జీవితంలో ఎప్పుడైనా ఉద్యోగాలు చేశారా? కనీసం దరఖాస్తు చేశారా? అని ప్రశ్నించారు. కర్ణాటకలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్సోళ్లు ఇప్పుడు మాట తప్పలేదా? అని నిలదీశారు. దేశంలో తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రమే లేదని వివరించారు. ఫలితాలు వెలువడిన మరుసటి రోజు అంటే డిసెంబర్ 4వ తేదీన తానే స్వయంగా అధికారులతో కలిసి అశోక్ నగర్‌కు వస్తానని చెప్పారు. అక్కడే జాబ్ క్యాలెండర్ రూపొందిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ యువతకు హామీ ఇచ్చారు.