Unemployment: బీఆర్ఎస్‌కు నిరుద్యోగుల సవాల్.. ఆకట్టుకుంటున్న హస్తం మ్యానిఫెస్టో.. రంగంలోకి కేటీఆర్
బీఆర్ఎస్ పార్టీకి నిరుద్యోగుల సమస్య అతిపెద్ద సవాల్‌గా మారుతున్నది. దీన్ని కాంగ్రెస్ అనుకూలంగా మార్చుకుంటున్నది. వారికి బంపర్ మ్యానిఫెస్టో ప్రకటించింది. దీంతో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. వెంటనే కేటీఆర్ రంగంలోకి దిగారు.
Telangana Elections: బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చాలా వరకు లబ్ది చేకూర్చనున్నాయి. ఆసరా పింఛన్, రైతు బంధు(బీమా), కళ్యాణ లక్ష్మీ/షాదీ ముబారక్, సాగు నీటి, విద్యుత్ వసతి వంటివి చాలా వరకు కలిసి వస్తున్నాయి. గృహ లక్ష్మీ, డబుల్ బెడ్ రూం, దళిత బంధు, బీసీ బంధు వంటి ఇతర పథకాలు కూడా బీఆర్ఎస్‌కు ప్రయోజనాలను కల్పిస్తాయి. కానీ, రాష్ట్రవ్యాప్తంగా చాలా వరకు యువతలో, ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వారిలో కేసీఆర్ ప్రభుత్వంపై పీకల్లోతు అసంతృప్తి ఉన్నది. ఏళ్ల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూడటం ఒక వంతు అయితే.. నోటిఫికేషన్లు వచ్చి భర్తీ ప్రక్రియ అర్ధంతరంగా ఆగిపోవడం మరొక వంతు. నోటిఫికేషన్లు వెలువడ్డాక కోర్టులకు ఎక్కడం, పేపర్ లీక్ వంటి ఘటనలు చాలా మందిని కలచివేసింది.
ఏళ్ల తరబడి ప్రిపేరేషన్‌లోనే గడిచిపోవడం నిరుద్యోగులన తీవ్రంగా బాధిస్తున్నది. నోటిఫికేషన్లు వచ్చినా ఉద్యోగాల సంఖ్య తక్కువ ఉండటంతో ఇటీవలి కాలంలో నిరుద్యోగులు రోడ్డెక్కారు కూడా. ఆత్మహత్యల ఘటనలూ చోటుచేసుకున్నాయి. అశోక్ నగర్‌లో వరంగల్‌కు చెందిన ప్రవళిక ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా కుదిపేసిన సంగతి తెలిసిందే. దీంతో బీఆర్ఎస్ పార్టీకి నిరుద్యోగుల సమస్య కొరకరాని కొయ్యగా మారిపోయింది. ఈ సమస్య రోజులు గడిచి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జఠిలమైంది. ఎన్నికల్లోనూ తీవ్రమైన ప్రతికూల ప్రభావం వేసే శక్తి ఈ సమస్యకు ఉన్నది.
Also Read: కరీంనగర్‌లో గంగుల, బండి మధ్య మాటల యుద్ధం.. ‘నిన్నెందుకు గెలిపించాలి?’
అందుకే కాంగ్రెస్ నిరుద్యోగులను ఆకర్షించేలా మ్యానిఫెస్టో ప్రకటించింది. కాంగ్రెస్‌ను గెలిపిస్తే తొలి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. గ్రూప్ 1,2,3,4 ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించి విడుదల చేయనున్న తేదీలతో సహా ప్రకటించింది. అభ్యర్థులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. అలాగే 13 ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉద్యోగాలనూ భర్తీ చేస్తామని, కానిస్టేబుల్ పరీక్షల నోటిఫికేషన్ల డేట్‌లనూ ప్రకటించింది. అంతేకాదు, నిరుద్యోగ భృతి ఇస్తామని, యూత్ కమిషన్ ద్వారా రూ. 10 లక్షల వరకు రుణాలను నిరుద్యోగులకు ఇస్తామని ప్రకటించింది.
అసలే నిరుద్యోగుల అసంతృప్తి, ఆ పై కాంగ్రెస్ నిరుద్యోగులను ఆకర్షించేలా బంపర్ మ్యానిఫెస్టో ప్రకటించడంతో బీఆర్ఎస్ పునరాలోచనలో పడింది. కేటీఆర్ రంగంలోకి దిగారు. నిరుద్యోగులతో సమావేశం అయ్యారు. అశోక్ నగర్ సహా పలు వర్సిటీల్లో ప్రిపరేషన్‌లో ఉన్న నిరుద్యోగులను కలిసి మాట్లాడారు. డిసెంబర్ 4వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న అభ్యర్థులు, విద్యర్థులతో అశోక్ నగర్‌లో విస్తృత స్థాయిలో సమావేశం నిర్వహించి వారి నుంచి సలహాలు తీసుకుంటామని చెప్పారు. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల ఆలోచనలకు అనుగుణంగా టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ప్రస్తుతం సుమారు 60 వేలకు పైగా ఉద్యోగాలకు జరుగుతున్న భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తామని, కోర్టు కేసుల విషయంలోనూ ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రూప్ 2 ఉద్యోగాల సంఖ్య పెంచి వెంటనే నోటిఫికేషన్ వేస్తామని చెప్పారు.
Also Read: KTR: బీజేపీ దుబ్బాక సీటుకు ఎసరు? ఈ స్థానం కోరుతున్నాం: కేటీఆర్
తాము ఇచ్చిన హమీకి రెట్టింపుగా అంటే లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చామని, అయితే.. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతున్నదని వివరించారు. ఇందులో 1.62 లక్షల ఉద్యోగాల భర్తీ పూర్తి అయిందని తెలిపారు. గత పదేళ్లలో తెలంగాణలో భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలు మరే రాష్ట్రంలోనూ భర్తీ కాలేవని చెప్పారు. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ ఈ విషయంపై యువకులకు గణాంకాలతో సహా వివరించాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ చేసిన ఈ ప్రయత్నాలు యువత, నిరుద్యోగుల్లో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయా? లేదా? అనేది సస్పెన్స్.