ఏకంగా 50 మీటర్ల ఎత్తైన మొబైల్ టవర్ నే ఎత్తుకెళ్లారు..
ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ విచిత్రమైన దొంగతనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందరూ ఇదేం విచిత్రం అని ఆశ్చర్యపోతున్నారు.
ఉత్తరప్రదేశ్ : యూపీలో విచిత్రమైన దొంగతనం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలోని ఉజ్జయిని గ్రామంలో 10 టన్నులకు మించి బరువున్న, 50 మీటర్ల ఎత్తైన మొబైల్ టవర్ ను దొంగిలించారు. సందీపన్ ఘాట్ పోలీస్ స్టేషన్ కు సమాచారం తెలియడంతో పోలీసుల బృందం స్థలాన్ని పరిశీలించింది. భూ యజమాని, స్థానికుల వాంగ్మూలాలను నమోదు చేశారు. ఈ సంఘటన గురువారం పోలీసులను పరుగులు పెట్టించింది. ఈ ఏడాది జనవరిలో కౌశంబి జిల్లాలోని ఉజ్జయిని గ్రామంలో ఉబిద్ ఉల్లా అనే వ్యక్తి పొలంలో తమ కంపెనీ టవర్‌ను ఏర్పాటు చేసినట్లు టెక్నీషియన్ రాజేష్ కుమార్ యాదవ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
అయితే గతంలో ఇలాంటి ఘటనే బీహార్‌లో వెలుగు చూసింది. అక్కడ 60 అడుగుల పొడవైన ఇనుప వంతెనను దొంగలు ఎత్తుకెళ్లారు. ఇది జరగిని సంవత్సరం తర్వాత, ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలోని ఉజ్జయిని గ్రామంలో 10 టన్నుల కంటే ఎక్కువ బరువున్న 50 మీటర్ల ఎత్తైన మొబైల్ టవర్ దొంగిలించబడింది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నవంబర్ 29, బుధవారం నాడు ఒక టెక్నీషియన్ ఈ విషయాన్ని పోలీసులకు తెలిపాడు. మార్చి 31నుంచి టవర్ కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతని ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐపీసీ సెక్షన్ 379 (దొంగతనం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
టవర్ మాత్రమే కాదు, మొబైల్ టవర్ అసెంబ్లింగ్‌లో భాగంగా రూ. 8.5 లక్షలకు పైగా విలువైన షెల్టర్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్, ఇతర పరికరాలు మాయమైనట్లు టెక్నీషియన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. వంతెనలోని లోహాన్ని స్క్రాప్ విక్రయించేందుకు దొంగిలించినట్లుగా తెలుస్తుంది. యూపీలోని టవర్ కూడా అలాగే దొంగిలించి ఉంటారని అనుమానిస్తున్నారు.