Telangana Polls 2023 : హైదరాబాద్ అభివృద్ధి వారిద్దరి వల్లే.. చంద్రబాబు, వైఎస్సార్‌లపై డీకే శివకుమార్ ప్రశంసలు
హైదరాబాద్ అభివృద్ధికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిలు కృషి చేశారని ప్రశంసించారు కేపీసీసీ అధ్యక్షుడు , కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. తొమ్మిదన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని.. తెలంగాణలో మార్పు కోరుకుంటున్నారని డీకే అన్నారు.
కేపీసీసీ అధ్యక్షుడు , కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆయన బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొన్నారు. తాజాగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో డీకే శివకుమార్ మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిలు కృషి చేశారని ప్రశంసించారు. తొమ్మిదన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని.. తెలంగాణలో మార్పు కోరుకుంటున్నారని డీకే అన్నారు.
హైదరాబాద్, బెంగళూరు నగరాలు భారతదేశానికి కవల పిల్లల వంటివని శివకుమార్ అభివర్ణించారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు బహుమతి ఇచ్చే సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కాంగ్రెస్ పాలన కోసం ఎదురుచూస్తున్నారని.. కర్ణాటకలో పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని డీకే శివకుమార్ తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ కర్ణాటక వచ్చి చూడాలని ఆయన చురకలంటించారు.
అంతకుముందు ఆదిలాబాద్ లో జరిగిన విజయభేరి సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. రైతుభరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ అని రాహుల్ గుర్తుచేశారు. కాంగ్రెస్ మళ్లీ గెలిస్తే.. సాగుకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తామని ఆయన పేర్కొన్నారు.
ALso Read: Revanth Reddy... బీజేపీ, బీఆర్ఎస్ తో పోటీ కాదు ..ఈడీ ,ఐటీ తోనే:రేవంత్ రెడ్డి
కౌలు రైతులకు కూడా రైతుభరోసా అమలు చేస్తామని.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎంతమందికి వచ్చాయని రాహుల్ ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిస్తే పేదల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని ఆయన వెల్లడించారు. ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు జరుగుతున్నాయని రాహుల్ అభివర్ణించారు. దొరల తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులు ప్రజా ధనాన్ని లూటీ చేశారని ఆయన దుయ్యబట్టారు. భూములు, ఇసుక, మద్యం ద్వారా దోపిడీ సొమ్మంతా కేసీఆర్‌కు చేరిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. పేదల భూములు లాక్కునేందుకే దొరల సర్కార్ ధరణి తెచ్చిందని.. దళితబంధులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రూ . 3 లక్షల కమీషన్లు దోచుకున్నారని ఆయన ఆరోపించారు.
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ 6 గ్యారంటీల కార్డు తీసుకొచ్చిందని రాహుల్ గాంధీ వెల్లడించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను చట్టంగా మారుస్తామని.. అమలు చేయకపోతే ప్రశ్నించే హక్కును ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం లాక్కున్న భూములు మళ్లీ పేదలకే అప్పగిస్తామని ..కేసీఆర్ దోచుకున్న ప్రజల సొమ్మును వసూలు చేసి ప్రజలకే ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ , ఎంఐఎం మధ్య ఒప్పందం వందని ఆయన పేర్కొన్నారు. మోడీకి కేసీఆర్, అసదుద్దీన్ మంచి మిత్రులని రాహుల్ ఆరోపించారు. మోడీకి ఢిల్లీలో కేసీఆర్, అసదుద్దీన్‌లు సహాయం చేస్తారని.. తెలంగాణలో కేసీఆర్, అసదుద్దీన్‌లకు మోడీ సాయం చేస్తారని ఆయన ఎద్దేవా చేశారు.