Janasena Party: అన్ని స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు.. తెలంగాణలో జనసేన ఫ్లాప్ షో
జనసేన పార్టీ తెలంగాణ ఎన్నికల్లో ఫ్లాప్ షో ఇచ్చింది. పోటీ చేసిన 8 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. కానీ, జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ మాత్రం అనూహ్యంగా పుంజుకుంది.
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీ 32 స్థానాల్లో పోటీ చేయాలని అనుకుంది. బీజేపీ పొత్తు ప్రతిపాదించడంతో సీట్ల కేటాయింపులో 8 స్థానాలతో పవన్ కళ్యాణ్ పార్టీ సరిపెట్టుకుంది. ఇందులో ఐదు స్థానాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే పోటీ చేసింది. ఇందులో కొన్ని స్థానాల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రచారం చేశారు. కానీ, ఆయన ప్రచార ప్రభావం, పార్టీ విధానాల ప్రభావం తెలంగాణ ప్రజలపై పెద్దగా లేదని ఈ ఎన్నికలతో తేలిపోయింది. ఈ పార్టీ పోటీ చేసిన 8 స్థానాల్లో కనీసం డిపాజిట్లు కూడా కాపాడుకోలేకపోయింది. కూకట్‌పల్లిలో జనసేన పార్టీకి సెటిలర్ల నుంచి ఓట్లు పడతాయని ఎక్కువ ఆశలు ఉండేవి. కానీ, పవన్ కళ్యాణ్ పార్టీ మాత్రం తెలంగాణలో అట్టర్ ఫ్లాప్ షో ఇచ్చినట్టయింది.
కూకట్‌పల్లి, తాండూరు, కొత్తగూడెంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రచారం చేశారు. అయినా ఈ పార్టీ కనీసం పోటీలో నిలవలేకపోయింది. కూకట్‌పల్లి, తాండూరు, కోదాడ, నాగర్‌కర్నూల్, ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వరావుపేట స్థానాలో పవన్ కళ్యాణ్ పార్టీ పోటీలో నిలబడింది.
జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ సుమారు 90 స్థానాల్లో డిపాజిట్లను రాబట్టుకోలేకపోయింది. అయితే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఎమ్మెల్యేను గెలుచుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుంది. మొత్తం 8 స్థానాలను బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉన్నది.
తెలంగాణలో ఆంధ్రా బేస్ పార్టీలకు పెద్దగా ఆదరణ ఉండదనేది మరోసారి స్పష్టమైంది. జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకోవడంపైనా చాలా మంది ఇలాంటి విమర్శలే చేశారు. ఏపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని అభ్యంతరం చేశారు.