Janasena Party: వైసీపీకి దొరికిపోయిన జనసేన.. బరిలో నిలబడకుండా టీడీపీ పర్ఫెక్ట్ డెసిషన్, ఎందుకంటే?
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి జనసేన ఏపీలో డ్యామేజీ అయ్యే పరిస్థితులు ఉండగా.. ఇక్కడ పోటీకి దూరంగా ఉండటం టీడీపీకి కలిసొస్తున్నది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు సీట్ల కేటాయింపులో బేరసారాలు ఆడే అవకాశం టీడీపీకి చిక్కడమే కాదు.. అక్కడక్కడ టీడీపీ మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గెలవడం, రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టడంపై టీడీపీ శ్రేణులలో ఒక రకమైన ఉత్సాహం కనిపిస్తున్నది.
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్ర విడిపోయాక ఉభయ రాష్ట్రాల్లో పోలికలు చాలా వరకు తగ్గిపోయాయి. ముఖ్యంగా రాజకీయాల్లో ఇది కొట్టోచ్చినట్టు కనిపిస్తున్నది. ఇక్కడ ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉంటే.. అక్కడ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పార్టీ పెట్టి గెలిచారు. తొలి దఫా టీడీపీ అధికారాన్ని కొనసాగించింది. ఈ రెండు రాష్ట్రాల రాజకీయ పరిస్థితుల్లో పొంతన లేదు. సెంటిమెంట్ కూడా పూర్తిగా భిన్నమైంది. అందుకే అక్కడి పార్టీలు ఇక్కడ, ఇక్కడి పార్టీలు అక్కడ రాజకీయాలు చేయడం లేదు. కానీ, జనసేన మాత్రం సాహసోపేత నిర్ణయం తీసుకుంది.
పవన్ కళ్యాణ్ ఏ నమ్మకంతో 32 సీట్లు పోటీ చేస్తా అన్నాడేమో గానీ.. బీజేపీతో పొత్తులో 8 సీట్లకు పోటీ చేస్తే ఒక్కటి కూడా కనీసం డిపాజిట్ దక్కించుకోలేదు. పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రచారం చేసినా ఓట్లు నోటాతో పోటీ పడ్డాయి. జాతీయ పార్టీ మద్దతుతో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంత పార్టీ కోసం స్వయంగా ప్రచారం చేసినా సభలకు జనాలను రప్పించుకోగలిగారు, గానీ ఓట్లను సంపాదించుకోలేకపోయారు. ఒక్క కూకట్‌పల్లి తప్పితే మిగిలిన ఏడు స్థానాల్లో ఐదు వేల ఓట్లను కూడా సంపాదించుకోలేకపోయింది.
Also Read: Revanth Reddy: రేవంత్ రెడ్డి జర్నలిస్టు అవతారం.. అసలు ఆ పత్రికలో ఎందుకు చేరాడు?
సెటిలర్లు అధికంగా ఉంటారని కూకట్‌పల్లిలో గెలుస్తామని జనసేన భావించింది. గత అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి నందమూరి వెంటక సుహాసిని 70,563 ఓట్లను సంపాదించుకోగలిగారు. కానీ, ఈ సారి జనసేన ఇదే స్థానంలో ఇంచుమించు సగం ఓట్లను సాధించుకోవడం గమనార్హం. సుమారు 20కిపైగా స్థానాల్లో జనసేన గెలుపోటములను ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్నదని పవన్ కళ్యాణ్ చెప్పడం, ఫలితాలు చూస్తే కనీస పోటీ ఇవ్వకపోవడం ఆయనకు పెద్ద మైనస్‌గా మారే ముప్ప ఉన్నది.
ఏపీలో సీఎం జగన్ పై ఉవ్వెత్తున ఎగసి పడే పవన్ కళ్యాణ్.. గతంలో కంటే తమ పార్టీ గణనీయంగా మెరుగుపడిందని చెబుతుంటారు. గత ఎన్నికల్లో ఏపీలో జనసేనాని రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోగా.. ఒకే ఒక్క అభ్యర్థి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఫలితాలు చూస్తే ఏపీలో ఆయన ప్రదర్శనను అతిశయంగా చూడలేమని విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: CM Revanth Reddy: రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం చెక్.. కేసీ వేణుగోపాల్ సంచలన స్టేట్‌మెంట్
ఏపీలో టీడీపీతో జనసేన కలిసి పోటీ చేయాలని సమన్వయ కమిటీలు, తర్జన భర్జనలు జరుగుతున్నాయి. కానీ, పవన్ పేలవ ప్రదర్శనతో టీడీపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపులను తగ్గించే ముప్పు ఉంటుంది. మరో ముఖ్య విషయం.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్‌లో పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడటానికి వైసీపీకి ఒక అస్త్రం తెలంగాణ ఎన్నికల ఫలితాల రూపంలో దొరికినట్టయింది.
జనసేన డ్యామేజీతో టీడీపీ సీట్ల కేటాయింపులో కోత పెట్టడమే కాదు.. తెలంగాణ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండటం టీడీపీకి కలిసిరానుంది. జనసేన బలహీనంగానే ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత చాలా వరకు టీడీపీకి మళ్లే అవకాశం ఉంటుంది. ఇది ఆ పార్టీకి కలిసిరానుంది. తెలంగాణలో పోటీకి దూరంగా ఉన్నప్పటికీ పలు చోట్ల కాంగ్రెస్ పార్టీకి స్థానిక క్యాడర్ మద్దతు పలికింది. చివరకు రేవంత్ రెడ్డి సీఎం కాబోతున్నారు. చంద్రబాబు నాయుడితో రేవంత్ రెడ్డికి గల సత్సంబంధాలు టీడీపీ క్యాడర్‌లో ఒక రకమైన పాజిటివ్ ఫ్యాక్టర్‌ను కలిగించే అవకాశాలు ఉన్నాయి. వైసీపీకి అండగా నిలబడిన బీఆర్ఎస్ ఓడిపోవడం ఈ పార్టీకి నైతికంగా కొంత నష్టంగానే ఉంటుంది.
Also Read: Telangana Cabinet: డిప్యూటీ సీఎంగా పొన్నం ప్రభాకర్? అందుకోసమేనా?
గత అసెంబ్లీలో హైదరాబాద్‌లోని టీడీపీ అభిమానులు, టీడీపీ అనుకూల వ్యాపారుల నుంచి సొమ్ము ఆ పార్టీకి ముట్టగుండా బీఆర్ఎస్ ఇబ్బందులు పెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి రాక టీడీపీ వర్గాలకు శుభసూచకంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి.