Pawan kalyan: బీజేపీ ,జనసేన అభ్యర్ధులకు మద్దతుగా తెలంగాణలో ప్రచారం
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది.
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 25వ తేదీన వికారాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, జనసేన మధ్య పొత్తు ఉంది. జనసేన పార్టీకి బీజేపీ ఎనిమిది స్థానాలను కేటాయించింది. వికారాబాద్ జిల్లాలోని పరిగి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్ధి ఎన్. శంకర్ గౌడ్ కు మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించనున్నారు. మరో వైపుఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు, కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడ పవన్ కళ్యాణ్ ప్రచారం చేసే అవకాశం ఉందని సమాచారం.ఈ నెల 22న వరంగల్ లో, ఈ నెల 26న మోడీతో కలసి ఎన్నికల సభలో పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశం ఉంది.
ఈ దఫా కనీసం 32 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని జనసేన భావించింది. అయితే తాము పోటీ చేసే 32 స్థానాలను కూడ జనసేన ప్రకటించింది. అయితే ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించింది.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ లు కలిసి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో చర్చించారు. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడ సమావేశమయ్యారు.
ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు కుదిరింది. రెండు పార్టీలు నేతలు పలు దఫాలు చర్చించారు. ఈ చర్చల తర్వాత జనసేనకు ఎనిమిది స్థానాలు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది. ఎనిమిది స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది. మిగిలిన 111 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్ధులకు మద్దతుగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఈ నెల 25న వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.2014 ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్ధుల తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో పాలకుర్తి నుండి టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు. హైద్రాబాద్ లో జరిగిన ఎన్నికల సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
హైద్రాబాద్, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ,రంగారెడ్డి జిల్లాలపై జనసేన కేంద్రీకరించింది. 32 అసెంబ్లీ స్థానాల్లో జనసేన ఫోకస్ పెట్టింది. కానీ, బీజేపీతో పొత్తు కారణంగా జనసేన ఎనిమిది స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది.
also read:అభ్యర్థులకు బీ ఫామ్స్ ఇచ్చిన జనసేనాని.. బరిలో నిలిచిన వారు వీరే..
ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదు. తొలుత పోటీ చేయాలని భావించింది. అయితే చంద్రబాబు నాయుడు అప్పటికి జైల్లో ఉండడంతో పాటు ఇతరత్రా కారణాలతో తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ చేయలేకపోతున్నట్టుగా ఆ పార్టీ భావించింది. దీంతో ఎన్నికల బరి నుండి తప్పుకుంది. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటు బ్యాంక్ ఎటువైపు మళ్లుతుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.