IT Raids in Telangana : కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంట్లో ఐటీ రైడ్స్... భయాందోళనతో సంపత్ భార్యకు అస్వస్థత
ఆలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఇంటివద్ద గత అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. ఐటీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు చేపట్టగా...భయాందోళనతో సంపత్ భార్య అనారోగ్యానికి గురయ్యారు.
ఆలంపూర్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులపై ఇన్కమ్ ట్యాక్స్ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులు వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటివారిపై ఐటీ రైడ్స్ జరగ్గా తాజాగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. శాంతినగర్ లోని సంపత్ కుమార్ ఇంటికి చేరుకున్న ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.
జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గ పరిధిలోని వడ్డేపల్లి మండలం శాంతినగర్ లో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నివాసిస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆలంపూర్ నుండి ఆయననే బరిలోకి దింపింది. పోలింగ్ కు మరో మూడురోజుల సమయం మాత్రమే వుండటంతో ఆయన ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో ఆయన ఇంటిపై ఐటీ రైడ్స్ కలకలం సృష్టిస్తున్నారు.
గత రాత్రి 12 గంటల సమయంలో ఐటీ, విజిలెన్స్ అధికారులు సంపత్ ఇంటికి చేరుకుని సోదాలు చేపట్టారు. ఇలా అర్ధరాత్రి అధికారులు ఇంటికిరావడంతో కంగారుపడిపోయిన సంపత్ భార్య మహాలక్ష్మి హైబిపికి గురయి స్ఫృహతప్పి పడిపోయారు. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు. సమయానికి చికిత్స అందడంతో ఆమె ఆరోగ్యం మెరుగుపడినట్లు సమాచారం.
Read More ఈసీ నోటీసు.. కేటీఆర్ ఇంకా స్పందించలేదు , ఏకే గోయల్ ఇంట్లో ఏం దొరకలేదు : సీఈవో వికాస్ రాజ్ ప్రకటన
ఈ ఐటీ రైడ్స్ సమయంలో సంపత్ ఇంట్లో లేనట్లు తెలుస్తోంది. ఈ రైడ్స్ విషయం తెలిసి అదే రాత్రి కాంగ్రెస్ శ్రేణులు భారీగా సంపత్ ఇంటివద్దకు చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇంటిముందే రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఇంటివద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.