Barrelakka: కొల్లాపూర్‌లో బర్రెలక్క పోటీతో ఎవరికి నష్టం? ఎవరికి మేలు?
కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష పోటీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. నిరుద్యోగ అంశాన్ని ప్రధానం చేసుకున్న ఆమె పోటీకి ఇతర జిల్లాల నుంచీ అనూహ్య మద్దతు లభిస్తున్నది. ఆమె పోటీ ఎవరికి లాభం? ఎవరికి నష్టం అనే చర్చ మొదలైంది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారం, వ్యూహాలు తారాస్థాయికి చేరుకున్నాయి. నిన్నా మొన్నటి వరకు బర్రెలక్క పోటీని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు ఆమె సెన్సేషనల్. ఆమె పోటీలో నిలబడినా పోయేదేమీ లేదనే మాట గతం. ఇప్పుడు ఆమె పోటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె పోటీతో ఎవరికి నష్టం వాటిల్లవచ్చు? ఎవరికి ప్రయోజనం సమకూరవచ్చు? అనేది ఇప్పుడు మొదలైన టెన్షన్. అంతేనా, బర్రెలక్కనే గెలిపించాలని స్వచ్ఛందంగా ప్రచారం చేసేవాళ్లు రోజు రోజుకు పెరుగుతున్నారు. ఆమెనే గెలుస్తారనే నమ్మకం ఉన్నవాళ్లూ ఉన్నారు. ఆమె గెలిస్తే రాష్ట్రంలో సంచలనమే. ఒక వేళ ఓడిపోతే.. రెండు ప్రధాన పార్టీ అభ్యర్థుల గెలుపోటములను ఆమె పోటీ గణనీయంగా ప్రభావితం చేయనుందనే విశ్లేషణలు జరుగుతున్నాయి.
తెలంగాణ ప్రచారం పరాకాష్టకు చేరిన తరుణంలో నిరుద్యోగ సమస్య కీలకంగా ముందుకు వచ్చింది. ఐటీ హబ్ వద్ద కేటీఆర్ నిరుద్యోగులతో మాట్లాడి వారికి హామీలు ఇచ్చిన వార్తపై సోషల్ మీడియాలో పలు విధాల వాదనలు జరిగాయి. ఇదే ధోరణిలో కాంగ్రెస్ కూడా నిరుద్యోగులను కలువాలని అనుకుంది. ఉద్యోగార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అశోక్ నగర్ అడ్డాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెళ్లారు. అక్కడ నిరుద్యోగులతో మాట్లాడారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు దాదాపు కాంగ్రెస్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతలో నిరుద్యోగ అంశానిది ప్రధాన స్థానం.
Also Read: Rahul Gandhi: ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం: నిరుద్యోగులతో రాహుల్ గాంధీ
ఇప్పుడు బర్రెలక్క ఈ నిరుద్యోగం అనే అంశాన్నే బలంగా ముందుకు తెస్తున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వం సక్రమగా నియామకాలు చేపడితే తాను బరిలో ఉండేదాన్నే కాదని, తన మ్యానిఫెస్టోలనూ నిరుద్యోగులకు సంబంధించిన విషయాలనే శిరీష ప్రధానంగా పేర్కొంది. దీంతో ఆమె పోటీకి ప్రాధాన్యత మరింత పెరిగింది.
Also Read: Dog: కుక్క విశ్వాసం.. అడ్డు రావడంతో యాక్సిడెంట్.. మృతుడి తల్లి చేతిలో తల వాల్చి ఆ కుక్క విచారం
కొల్లాపూర్ నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటా పోటీగా ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ పై గెలిచి బీఆర్ఎస్‌లోకి వెళ్లిన బీరం హర్షవర్దన్ రెడ్డి ఇప్పుడు అధికార పార్టీ తరఫున బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ టికెట్ పై గతంలో ఓడిపోయిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ పై బరిలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేతోపాటు జూపల్లికి కూడా నియోజకవర్గంపై మంచి పట్టు ఉన్నది. వీరి మధ్య పోటీ హోరాహోరీగా ఉన్నది. ఎవరు గెలిచినా మార్జిన్ చాలా తక్కువగా ఉంటుందనే విశ్లేషణలు ఉన్నాయి. ప్రస్తుతం బర్రెలక్క ఆ మెజార్టీ ఓట్లను ప్రభావితం చేయగలదనే వాదనలూ వినిపిస్తున్నాయి. నిరుద్యోగ అంశాన్ని ప్రధానంగా చేసుకున్న బర్రెలక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటును గంపగుత్తగా కాంగ్రెస్‌కు వెళ్లకుండా చీల్చే ముప్పు ఉన్నదని విశ్లేషిస్తున్నారు. దీంతో ప్రతిపక్ష అభ్యర్థి వర్గంలో బర్రెలక్క (Barrelakka alias Karne Shirisha) పోటీ టెన్షన్ పుట్టిస్తున్నదని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతున్నది.