Rahul Gandhi: ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం: నిరుద్యోగులతో రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. వచ్చిన ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. తాను శనివారం అశోక్ నగర్‌లోని నిరుద్యోగ యువతను కలిసినట్టు తెలిపారు. వారి మాటలు విన్నాక బాధ వేసినట్టు వివరించారు.
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో నియామకాలు ప్రధాన ఎజెండాగా మారుతున్నది. నిరుద్యోగ యువతలో బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తి ఉన్నది. ఆ అసంతృప్తి చల్లార్చడానికి మంత్రి కేటీఆర్ సహా పలువురు నేతలు ప్రయత్నాలు చేశారు. అయితే.. ఈ అంశాన్ని కాంగ్రెస్ క్యాష్ చేసుకునే పనిలో ఉన్నది. ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నది. తాజాగా, రాహుల్ గాంధీ అదే కోణంలో ఒక ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. తాను ఈ రోజు హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతను కలిసినట్టు పేర్కొన్నారు. తెలంగాణ వస్తే తమకు కొలువులు వస్తాయని ఆశించామని ఆ యువత తనకు చెప్పినట్టు వివరించారు. కానీ, రాష్ట్రం సిద్ధించి పదేళ్లు అవుతున్నా తమ ఆకాంక్షలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేయడం తనను బాధించిందని తెలిపారు.
Also Read: rythu bandhu: బ్యాంకులకు వరుస సెలవులు.. రైతు బంధు డబ్బులు పడేది ఆ రోజే!
కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ యువతకు న్యాయం జరగలేదు. నోటిఫికేషన్లు లేక, కోర్టు కేసులతో, పేపరు లీకులతో 30 లక్షల మంది నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారు. వారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలోనే వారికి కలువులు రాని దుస్థితి. అందుకే వారి కలలు సాకారం అయ్యేలా.. కాంగ్రెస్ పార్టీ రూపొందించిన జాబ్ క్యాలెండర్‌ను వారికి చూపించి వారిలో భరోసా నింపే ప్రయత్నం చేశాను. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే 2 లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం’ అని రాహుల్ గాంధీ శనివారం రాత్రి ట్వీట్ చేశారు.