హైదరాబాద్ అపోలోలో గువ్వల బాలరాజు... ఆరోగ్య పరిస్థితిపై భార్య కామెంట్స్ (వీడియో)

నిన్న(శనివారం) రాత్రి రాళ్లదాడిలో గాయపడ్డ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హైదరాబాద్ అపోలోలో చికిత్స పొందుతున్నారు. ఆయనను ఇవాళ ఉదయం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. 

 

Guvvala Amala reacts on his hunband Balaraju health condition AKP

అచ్చంపేట : నిన్న(శనివారం) రాత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై రాళ్ళదాడి జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా బిఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవ మరింత ముదిరి స్వయంగా ఇరుపార్టీల అభ్యర్థులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే బాలరాజుపై కాంగ్రెస్ శ్రేణులు రాళ్లదాడికి పాల్పడ్డాయి. దీంతో గాయపడిన బాలరాజు ప్రస్తుతం హైదరాబాద్ అపో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.  

తన భర్త బాలరాజుపై జరిగిన దాడిపై గువ్వల అమల స్పందించారు. రాళ్లదాడిలో తన భర్త  దవడ, మెడ భాగంలో గాయాలయ్యాయని... ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగ్గానే వున్నట్లు అమల తెలిపారు. డాక్టర్లు మెరుగైన వైద్యం అందిస్తున్నారని... ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. తన భర్త ఆరోగ్య పరిస్థితిపై  అనుచరులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గువ్వల అమల తెలిపారు. 

Read More  బీఆర్ఎస్‌కు వత్తాసు పలుకుతున్నాడు: అచ్చంపేట సీఐపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

తన భర్త గువ్వల బాలరాజు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ వాళ్లు కావాలనే రెచ్చగొడుతున్నారని గువ్వల అమల తెలిపారు. కనీసం తమను ప్రచారం కూడా చూసుకోనివ్వకుండా కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ, ఆయన అనుచరులు దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. శనివారం రాత్రి కూడా ప్రచారం ముగించుకుని వెళుతుంటే తమ కార్లను అడ్డుకుని రాళ్లదాడికి తెగబడ్డారని అన్నారు. బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల కోసం అక్కడికి వెళ్లిన తన భర్తపై కూడా వంశీకృష్ణ అనుచరులు దాడిచేసి గాయపర్చారని అమల వెల్లడించారు. 

 

కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ చాలా నీచంగా వ్యవహరిస్తున్నారని... అనుచరులతో తనను కూడా అసభ్యంగా తిట్టిస్తున్నాడని అమల ఆరోపించారు. ఇప్పటికే తనపై నీచంగా మాట్లాడుతున్నవారు, సోషల్ మీడియాలో  అసభ్యకర పోస్టులు పెడుతున్నవారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అమల తెలిపారు. కానీ కాంగ్రెస్ నాయకుల తీరులో ఏమాత్రం మార్పు రాలేదని అన్నారు. నియోజకవర్గంలో ప్రచారం చేపడితే అంతు చూస్తామని తమ కార్యకర్తలను బెదిరిస్తున్నారని అమల అన్నారు. 

కాంగ్రెస్ నాయకులు నీచ రాజకీయాలను కట్టిపెట్టి ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికల్లో తలబడాలని... అప్పుడు ఎవరిపక్షాన ప్రజలు వున్నారో అర్థమవుతుందని అన్నారు. అలాకాకుండా ఇలా పోటీచేస్తున్న నాయకులను బెదిరించడం, దాడులకు దిగడం చేస్తే ప్రజలే తగిన బుద్ది చెబుతారని అన్నారు. బిఆర్ఎస్ నాయకులు కారులో డబ్బులు తరలిస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నదంతా తప్పుడు ప్రచారమని గువ్వల అమల తెలిపారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios