Errabelli dayakar Rao..డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేను ఓడించిన యశస్విని: ఎవరీ యశస్విని రెడ్డి
ఓటమి ఎరుగని ఎర్రబెల్లి దయాకర్ రావు 26 ఏళ్ల యశస్విని చేతిలో ఓటమి పాలయ్యారు. ఆరు దఫాలు ఎమ్మెల్యేగా , ఓ దఫా ఎంపీగా విజయం సాధించిన దయాకర్ రావు ఓటమి పాలయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో కూడ తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఓటమి ఎరుగని నేతగా ఎర్రబెల్లి దయాకర్ రావుకు పేరుంది. అయితే ఈ ఎన్నికల్లో 26 ఏళ్ల యశస్విని రెడ్డి చేతిలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమి పాలయ్యారు.1994లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఎర్రబెల్లి దయాకర్ రావు అడుగు పెట్టారు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయరంగ ప్రవేశం చేశారు.తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. టీడీపీలో ఉన్న కాలంలో ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రి పదవి దక్కలేదు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ లో చేరిన తర్వాతే ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రి పదవి దక్కింది. అయితే మంత్రి పదవిని నిర్వహించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమి పాలయ్యారు.
ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించాలని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది . తొలుత పాలకుర్తి అసెంబ్లీ స్థానం నుండి హనుమాండ్ల ఝాన్సీరెడ్డిని కాంగ్రెస్ పార్టీ తొలుత అభ్యర్ధిగా నిర్ణయించింది. ఆమె ఎన్ఆర్ఐ. అయితే భారత పౌరసత్వం విషయంలో ఝాన్సీరెడ్డి ధరఖాస్తు విషయంలో స్పష్టత రాలేదు. దీంతో టెక్నికల్ గా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని ఝాన్సీరెడ్డి భావించింది. ఝాన్సీరెడ్డి కోడలు యశస్విని రెడ్డిని పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా తెరమీదికి తెచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడ ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దరిమిలా పాలకుర్తి నుండి యశస్విని రెడ్డి బరిలోకి దిగింది.
1994- 1999,1999-2004, 2004-2009 వరకు వర్ధన్నపేట అసెంబ్లీ స్థానం నుండి విజయం సాధించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎస్‌సీలకు రిజర్వ్ అయింది. దీంతో ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి మారాల్సి వచ్చింది.
2009, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా పాలకుర్తి అసెంబ్లీ స్థానం నుండి విజయం సాధించారు. 2016 తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలుగుదేశం పార్టీని వీడి భారత రాష్ట్ర సమితిలో చేరారు.2018 ఎన్నికల్లో పాలకుర్తి నుండి ఎర్రబెల్లి దయాకర్ రావు విజయం సాధించారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఎర్రబెల్లి దయాకర్ రావుకు చోటు దక్కింది. 2023 ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ అభ్యర్ధి యశస్విని రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
also read:Telangana Election results 2023: పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలు ఓటమి
2008 ఉప ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ స్థానం నుండి కూడ ఎర్రబెల్లి దయాకర్ రావు విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో ఈ స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన రవీంద్ర నాయక్ పై దయాకర్ రావు విజయం సాధించారు.
also read:ఎవరీ జాయింట్ కిల్లర్ వెంకటరమణ రెడ్డి: కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ ను ఓడించిన కాటిపల్లి
డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ ఎన్నికల్లో ఓటమి సాధించాల్సి వచ్చింది. అమెరికా నుండి వచ్చిన యశస్విని రెడ్డి చేతిలో దయాకర్ రావు ఓటమి పాలు కావడం సర్వత్రా చర్చకు దారి తీసింది. బిటెక్ పూర్తి చేసి అమెరికాలో పనిచేస్తున్న యశస్విని రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వరంగల్ కు వచ్చారు.