Telangana assembly elections 2023: సీఎం పదవిపై రేవంత్ రెడ్డికి అనుకూలంగా మల్లు రవి, విభేదించిన భట్టి
తెలంగాణ సీఎం పదవి విషయంలో కాంగ్రెస్ నేతలు తమ మనసుల్లో మాటలు బయట పెడుతున్నారు. ఈ విషయంలో మల్లు రవి రేవంత్ రెడ్డికి మద్దతుగా మాట్లాడితే, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాత్రం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి ఎవరికి వస్తుందనే చర్చ సాగుతుంది. అయితే సీఎం పదవి విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర నేతలు తమ మనసులోని మాటలు బయట పెడుతున్నారు. ఇదిలా ఉంటే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఆయన సోదరుడు మల్లు రవి సీఎం పదవి విషయంలో భిన్న ప్రకటనలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా ఉన్న వీరిద్దరూ భిన్న వ్యాఖ్యలు చేశారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని స్టేజీపైకి పిలుస్తూ తెలంగాణకు కాబోయే సీఎం అంటూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు మల్లు రవి రేవంత్ రెడ్డినుద్దేశించి వ్యాఖ్యానించారు.మల్లు రవి ఈ వ్యాఖ్యలు చేయగానే ఈ సభకు వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున చపట్లు కొడుతూ తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభలో మల్లు రవి ఈ వ్యాఖ్యలు చేయడం పార్టీలో చర్చకు దారి తీశాయి.
also read:kalwakurthy ఓటర్ల విలక్షణ తీర్పు: ఎన్‌టీఆర్ ఓటమి,మూడుసార్లు ఇండిపెండెంట్లకు పట్టం
ఇదిలా ఉంటే మధిర అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.భట్టి విక్రమార్క మధిరలో గెలవడమే కష్టం. ఇక సీఎం ఎలా అవుతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ విషయమై కౌంటరిచ్చేందుకు మల్లు భట్టి విక్రమార్క మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో మీడియా ప్రతినిధులు సీఎం పదవి విషయమై మల్లు భట్టి విక్రమార్కను ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి పదవికి అభ్యర్ధిని ఎన్నుకొనేందుకు ఓ విధానం ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా సమావేశమై సీఎల్పీ నేతను ఎన్నుకుంటారు. సీఎల్పీ నేతను ఎన్నుకున్నారని సీఎంగా ప్రమాణం చేసేందుకు ఆహ్వానించాలని గవర్నర్ కు కాంగ్రెస్ పార్టీ లేఖను పంపుతుందన్నారు.దీంతో సీఎంగా ప్రమాణం చేసేందుకు గవర్నర్ ఆహ్వానం పంపుతారన్నారు.
also read:tummala nageswara rao: నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ కోసం... ఎత్తులకు పై ఎత్తులు
గెలిచిన అభ్యర్థుల అభిప్రాయాలతో పాటు, పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకొని సీఎల్పీ నేతను ఎంపిక చేయడంలో కాంగ్రెస్ నాయకత్వం కీలకంగా వ్యవహరించనుందని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. సీఎం పదవిని ఆశించడంలో తప్పు లేదన్నారు. ఎవరికి సీఎం పోస్టు ఇచ్చినా పార్టీలో అందరూ నేతలు కూడ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.
also read:N.T.Rama Rao పేరుతో కేసీఆర్: కాంగ్రెస్ ఇందిరా గాంధీ ప్రచారానికి చెక్
ఇదిలా ఉంటే సీఎం పదవి విషయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, జానారెడ్డిలు తమ అభిప్రాయాలను ఇప్పటికే వ్యక్తం చేశారు. సీఎం పదవిపై కాంగ్రెస్ అగ్రనేతలు తమ మనసులో మాటలను బయట పెట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీఎం పదవి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకొంటారో ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.