సారాంశం

ముఖ్యమంత్రి పదవి విషయంలో ఇష్టారీతిలో  కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యల విషయంలో  వి.హనుమంతరావు  చేసిన వ్యాఖ్యలు  చర్చకు దారి తీశాయి.  సీఎం పదవి విషయంలో వ్యాఖ్యలు చేయవద్దని  హనుమంతరావు పార్టీ నేతలకు సూచించారు.

కామారెడ్డి: ముఖ్యమంత్రి పదవి విషయంలో   కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై  ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కామారెడ్డిలో  శుక్రవారం నాడు జరిగిన కాంగ్రెస్ సభలో  హనుమంతరావు (వీహెచ్)  ఈ వ్యాఖ్యలు చేశారు.  కర్ణాటక సీఎం సిద్దరామయ్య  ప్రసంగం ముగిసిన తర్వాత హనుమంతరావు  మాట్లాడారు.కాంగ్రెస్ లో ఎవరికి వారే నేనే సీఎం అంటున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు నేనే సీఎం అనడం మానేయాలని ఆయన కోరారు.  సీఎం ఎవరనే విషయాన్ని సోనియా, రాహుల్ గాంధీ, మాణిక్ రావు ఠాక్రే, ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారన్నారు.  ముందు ఎమ్మెల్యేలుగా గెలవాలని ఆయన  సూచించారు. ఠాక్రేజీ నేతలందరికీ  ఈ సీఎం గోల ఆపమని చెప్పాలని ఆయన కోరారు.  

గతంలో కూడ తనకు  సీఎం పదవి అవకాశం వచ్చిందన్నారు.  ఈ విషయమై తనను అప్పట్లో మీడియా ప్రతినిధులు అడిగితే అంతా పార్టీ అధిష్టానందే నిర్ణయమని చెప్పానన్నారు.కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలు  ఇటీవల కాలంలో సీఎం పదవిపై  వ్యాఖ్యలు చేస్తున్నారు. జగ్గారెడ్డి,  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,  జానారెడ్డి, రేవంత్ రెడ్డి  తదితరులు సీఎం పదవిపై  వ్యాఖ్యలు చేశారు. 

also read:ఎప్పటికైనా నేనే సీఎం: జగ్గారెడ్డి నుండి జానారెడ్డి వరకు మనసులో మాటలు బయటపెట్టిన నేతలు

దసరా రోజున  ఈ రాష్ట్రానికి ఏదో ఒక రోజున సీఎం అవుతానని  సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు.  అప్పటి వరకు  తనను కాపాడుకోవాలని జగ్గారెడ్డి కోరారు. సీఎం పదవిపై  తనకు ఇప్పుడే ఆశ లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.అయితే ఏదో ఒక రోజు తాను సీఎం అవుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. తాను  ఎమ్మెల్యేగా  కాకపోయినా  సీఎం పదవిని చేపడుతానని  సీనియర్ నేత జానారెడ్డి  చెప్పారు.కొడంగల్ బిడ్డ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తాడని  రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.