CM Revanth Reddy: ఆరు గ్యారంటీలతోనే పాలన మొదలు.. నేడు సీఎంగా రేవంత్, మంత్రులుగా పలువురి ప్రమాణం
రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రితోపాటు మరికొందరు మంత్రులతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించనున్నట్టు సమాచారం. ఆరు గ్యారంటీలకు సంబంధించిన చట్ట ముసాయిదాపైనే సీఎంగా రేవంత్ తొలి సంతకం చేయనున్నారు.
CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు కొలువుదీరనుంది. హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో ఈ రోజు మధ్యాహ్నం 1.04 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు కొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగానూ ప్రమాణం చేసే అవకాశం ఉన్నది. రేవంత్ రెడ్డి, మంత్రులతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయిస్తారు.
తొలుత ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఉదయం 10.28 గంటలకే అనుకున్నారు. కానీ, ఆ తర్వాత ముహూర్తాన్ని మధ్యాహ్నానికి మార్చారు. ఈ సారి ఎన్నికల్లో అధికారాన్ని రావడానికి కీలకంగా దోహదపడిన ఆరు గ్యారంటీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకోనుంది. సీఎంగా ప్రమాణం తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి తొలి సంతకం ఆరు గ్యారంటీల చట్టానికి సంబంధించిన ముసాయిదా పైనే సంతకం చేయనున్నట్టు తెలిసింది.
సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కాంగ్రెస్ భారీగా ప్లాన్ చేసింది. ప్రోటోకాల్ ప్రకారం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. పార్టీ పరంగానూ పలు కాంగ్రెస్ సీనియర్ నేతలు, కాంగ్రెస్ సీఎంలు, మాజీ సీఎంలు, కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకున్న ఇతర పార్టీల ముఖ్యమంత్రులనూ ఆహ్వానించారు.