Pilot Rohit Reddy పీఏపై సాయిపూర్‌లో దాడి:కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ, లాఠీచార్జీ
తాండూరు నియోజకవర్గంలో గురువారంనాడు ఉద్రిక్తత నెలకొంది. సాయిపూర్ లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అనుచరులు దొంగఓట్లు వేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఆందోళనకు దిగింది.
తాండూరు: వికారాబాద్ జిల్లాలోని తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని సాయిపూర్‌లో గురువారంనాడు బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పీఏపై కాంగ్రెస్ వర్గీయులు దాడికి దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. సాయిపూర్ లో రిగ్గింగ్ జరుగుతుందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి.
also read:Telangana Assembly elections 2023: తెలంగాణలో 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్
ఈ విషయమై బీఆర్ఎస్ కార్యకర్తలతో గొడవకు దిగారు. పోలింగ్ స్టేషన్ బయట కాంగ్రెస్ శ్రేణులు ధర్నాకు దిగారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేశారు. రోహిత్ రెడ్డి అనుచరులు దొంగఓట్లు వేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ విషయమై రోహిత్ రెడ్డి పీఏపై దాడికి దిగారు. ఇరు పార్టీల శ్రేణులపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు.
గత ఎన్నికల్లో పైలట్ రోహిత్ రెడ్డి తాండూరు నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పట్నం మహేందర్ రెడ్డిపై రోహిత్ రెడ్డి విజయం సాధించారు. ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ నుండి రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. ఈ దఫా రోహిత్ రెడ్డినే బీఆర్ఎస్ తన అభ్యర్థిగా బరిలోకి దింపింది. పట్నం మహేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా చేసింది. అంతేకాదు కేసీఆర్ తన మంత్రివర్గంలోకి మహేందర్ రెడ్డిని తీసుకున్నారు. దీంతో రోహిత్ రెడ్డి గెలుపు కోసం మహేందర్ రెడ్డి పనిచేస్తున్నారు.