సారాంశం


రెండు రోజుల క్రితం తన ఇండ్లలో జరిగిన  ఎన్ ఫోర్స్ మెంట్ సోదాల విషయమై చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్ధి వివేక్ వెంకటస్వామి రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెట్టారు. 

హైదరాబాద్: ఏదో చేసి తనను జైలులో పెట్టాలని చూస్తున్నారని  చెన్నూరు అసెంబ్లీ స్థానం నుండి  కాంగ్రెస్ అభ్యర్ధిగా  పోటీ చేస్తున్న వివేక్ వెంకటస్వామి ప్రకటించారు.

ఇటీవల తన నివాసాల్లో జరిగిన ఈడీ సోదాల విషయమై  వివేక్ వెంకటస్వామి స్పందించారు.  చెన్నూరులో  భారత రాష్ట్ర సమితి అభ్యర్ధి బాల్క సుమన్ కు  ఓటమి భయం పట్టుకుందని  వివేక్ వెంకటస్వామి ఆరోపించారు.ఈ భయంతోనే తనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారన్నారు.దీంతో  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేస్తే తన ఇండ్లపై ఈడీ సోదాలు నిర్వహించారని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. 

భారతీయ జనతా పార్టీలో ఉన్నంత కాలం తనపై ఎలాంటి దాడులు జరగలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరగానే తనపై దాడులు చేశారన్నారు. ఇప్పటివరకు కన్పించని తప్పులు ఇప్పుడే కన్పించాయా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.తనను అరెస్ట్ చేసేందుకు బీఆర్ఎస్ , బీజేపీలు ప్రయత్నాలు చేస్తున్నారు. నన్ను అరెస్ట్ చేసినా ప్రజలు తనను గెలిపించాలని ఆయన  కోరారు.

also read:కాంగ్రెస్ నేతలే సంపన్నులు: వివేక్ టాప్, ఆ తర్వాతి స్థానాల్లో పొంగులేటి, కోమటిరెడ్డి

తమ కుటుంబం చట్టపరంగానే వ్యాపారాలు చేస్తుందని  వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆయన  చెప్పారు.రెండు రోజుల క్రితం  చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్ధి వివేక్ వెంకటస్వామి  నివాసాల్లో  ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. వివేక్ వెంకటస్వామి  ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఈడీ ఆరోపించింది.ఈ మేరకు ఫెమా ఉల్లంఘన కింద కేసు నమోదు చేసినట్టుగా  ఈడీ ప్రకటించింది. రెండు రోజుల క్రితం  వివేక్ వెంకటస్వామి నివాసంలో జరిగిన  సోదాల గురించి  ఈడీ ప్రకటన విడుదల చేసింది.  

వివేక్ వెంకటస్వామి  ఇటీవలనే బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.  కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే  ఆయనకు ఆ పార్టీ చెన్నూరు అసెంబ్లీ టిక్కెట్టు కేటాయించింది.  బీజేపీ నాయకత్వం తీరుపై అసంతృప్తితో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడిన తర్వాత వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వివేక్ వెంకటస్వామి తర్వాత విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీలో అసంతృప్తితో ఉన్న నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం  సిద్దం చేసుకున్నారని ప్రచారం సాగుతుంది.ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, విజయశాంతిలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.