Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ నేతలే సంపన్నులు: వివేక్ టాప్, ఆ తర్వాతి స్థానాల్లో పొంగులేటి, కోమటిరెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉన్న  అభ్యర్థుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే  ఎక్కువ ధనవంతులుగా ఉన్నారు. ఈసీకి సమర్పించిన అఫిడవిట్లలో తమ ఆస్తులు, అప్పులను  అభ్యర్థులను ప్రకటించారు.  రాష్ట్రంలోని అందరికంటే వివేక్ వెంకటస్వామి రూ. 600 కోట్ల ఆస్తులతో అగ్రస్థానంలో ఉన్నారు.

 Telangana Election 2023: Congress netas top rich list; G Vivekananda assets exceeding Rs 600 crore  lns
Author
First Published Nov 14, 2023, 12:33 PM IST


 
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  బరిలో ఉన్న అభ్యర్ధుల్లో  సంపన్నుల జాబితాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులే ఎక్కువగా ఉన్నారు.  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా చెన్నూరు నుండి బరిలో ఉన్న వివేక్ వెంకటస్వామి  అత్యంత సంపన్నుడిగా  ఉన్నారు.  ఎన్నికల సంఘానికి  సమర్పించిన  అఫిడవిట్  మేరకు  వివేక్ వెంకటస్వామికి  రూ.600 కోట్లు ఉన్నట్టుగా పేర్కొన్నారు.

వివేక్ వెంకటస్వామి తర్వాతి స్థానంలో  పాలేరు అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగిన మరో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిలిచారు. రూ. 460 కోట్ల ఆస్తులు ఉన్నట్టుగా  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  తన అఫిడవిట్ లో పేర్కొన్నారు.

బీజేపీ నుండి వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలో చేరిన  వెంటనే ఆయనకు  చెన్నూరు టిక్కెట్టును కాంగ్రెస్ పార్టీ కేటాయించింది.  వివేక్ వెంకటస్వామి సోదరుడు వినోద్ బెల్లంపల్లి అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగుతున్నారు. 

వివేక్ వెంకటస్వామి  భార్య పేరున రూ. 377 కోట్ల విలువైన ఆస్తులున్నాయి.   1981లో  స్థాపించిన విశాఖ ఇండస్ట్రీస్  తో పాటు పలు కంపెనీల్లో  వాటాలున్న విషయాన్ని  వివేక్ వెంకటస్వామి వివరించారు.  అంతేకాదు  వివేక్ వెంకటస్వామికి రూ. 225 కోట్ల విలువైన స్థిరాస్తులున్నాయి.

 వివేక్ తో పాటు ఆయన భార్య రూ. 41.5 కోట్ల అప్పులు కలిగి ఉన్నారు.  వివేక్ వార్షిక ఆదాయం  గత ఆర్ధిక సంవత్సంరలో రూ. 4.66 కోట్ల నుండి రూ. 6.26 కోట్లకు పెరిగింది. వివేక్ వెంకటస్వామి  భార్య ఆదాయం రూ. 6.09 కోట్ల నుండి రూ. 9.61 కోట్లకు పెరిగింది.

పాలేరు అసెంబ్లీ స్థానం నుండి బరిలో ఉన్న  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  రూ. 460 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నారు.  ఇటీవలనే  కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  నివాసంలో  ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. నామినేషన్ దాఖలు చేసిన రోజే ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు చేయడంపై  కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు.  ఈ సోదాలను రాజకీయ ప్రేరేపితమైనవిగా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. భారత రాష్ట్ర సమితికి ప్రయోజనం కల్గించేలా  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులపై సోదాలు చేయించడంలో బీజేపీ కీలకంగా వ్యవహరిస్తుందని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.ఈ సోదాలకు తాము భయపడబోమని కూడ ఆయన తేల్చి చెప్పారు.

మరో వైపు మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  ఆదాయం కూడ పెరిగింది.  2022-23 ఆర్ధిక సంవత్సరంలో  ఆయన ఆదాయం రూ. 36.6 లక్షల నుండి రూ. 71.17 లక్షలకు పెరిగిందని ఈసీకి సమర్పించిన  అఫిడవిట్ లో పేర్కొన్నారు.  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కంపెనీ సుశీ ఇన్‌ఫ్రా, మైనింగ్  లిమిటెడ్ లో రూ. 239 కోట్ల విలువైన   1.24 కోట్ల షేర్లను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబం కలిగి ఉంది.  దీంతో  రాజగోపాల్ రెడ్డి  ఆస్తులు రూ. 459 కోట్లకు చేరుకున్నాయి.  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  కుటుంబ స్థిరాస్తులు రూ. 157 కోట్లు, అప్పులు  రూ. 4.14 కోట్లుగా  అఫిడవిట్ లో పేర్కొన్నారు రాజగోపాల్ రెడ్డి.

గత నెలలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  బీజేపీని వీడి  కాంగ్రెస్ పార్టీలో చేరారు.  మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కేటాయించింది.

తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  కుటుంబ ఆస్తుల విలువ రూ. 59 కోట్లు. తనకు రూ. 25 కోట్ల అప్పులున్నాయని కేసీఆర్ తన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. అయితే తనకు స్వంతంగా కారు కూడ లేదని కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఈ నెల  30న పోలింగ్ జరగనుంది. వచ్చే నెల  3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.  తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు  ఎన్నికలు జరుగుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios