Kaushik Reddy: మీరు దీవిస్తే విజయ యాత్రతో వస్తా.. లేకుంటే శవయాత్ర: బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి
హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తనను కచ్చితంగా దీవించాలని కోరారు. ఎన్నికల్లో గెలిస్తే డిసెంబర్ 3వ తేదీన(ఫలితాల రోజున) విజయ యాత్రతో వస్తానని చెప్పారు. లేదంటే తన శవ యాత్రకు ప్రజలు రావలని భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: ఎన్నికల క్యాంపెయినింగ్‌కు ఈ రోజుతో గడువు ముగియనుండటంతో అభ్యర్థులు ఎమోషనల్ కావడం సహజమే. కానీ, హుజురాబాద్ నుంచి బీఆర్ఎస్ టికెట్ పై బరిలోకి దిగిన పాడి కౌశిక్ రెడ్డి కొంచెం ఎక్కువ భావోద్వేగానికి గురయ్యారు. ప్రజలు దీవిస్తే ఎన్నికల్లో గెలిచి విజయ యాత్రతో వస్తానని చెప్పారు. లేదంటే తాను, తన భార్య, బిడ్డ ఆత్మహత్య చేసుకుంటామని, అప్పుడు తమ శవయాత్రకు ప్రజలు రావాలని అన్నారు.
హుజురాబాద్‌లో పాడి కౌశిక్ రెడ్డి ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో ఆయన కుటుంబం కూడా క్రియాశీలకంగా పాల్గొంటున్నది. క్యాంపెయినింగ్ చివరి రోజున ఆయన వాహనంపై కుటుంబంతోపాటు నిలబడి భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. తనను ఒక్కసారి గెలిపిస్తే వారి కడుపులో తలనై ఉంటానని, గెలిచి వారి గురించి నిరంతరం శ్రమిస్తానని చెప్పారు.
ఈ సారి ఎన్నికల్లో తనను గెలిపిస్తే డిసెంబర్ 3వ తేదీన విజయ యాత్రతో వస్తానని కౌశిక్ రెడ్డి అన్నారు. లేదంటే.. మరుసటి రోజు తాము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పారు. ఆ తర్వాత తమ శవయాత్రకు ప్రజలు రావాలని వివరించారు. తాను ప్రచారం చేసిన వీధుల్లోనే శవ యాత్ర కూడా జరుగుతుందని ఉద్వేగంగా అన్నారు.
Also Read: Hyderabad: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రేపు, ఎల్లుండి స్కూళ్లు, కాలేజీలకు సెలవు
హుజురాబాద్‌లో పోటీ తీవ్రతరంగా ఉన్నది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈటల రాజేందర్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు మంత్రిగానూ చేశారు. ఆ తర్వాత కేసీఆర్‌తో విభేదాల విషయంలో బయటకు వచ్చి బీజేపీలో చేరారు. అన్ని పదవులకు రాజీనామా చేయడంతో జరిగిన ఉపఎన్నికలోనూ ఈటల రాజేందర్ గెలిచారు. ఉపఎన్నికలో ఈటల రాజేందర్ పై బీఆర్ఎస్ గెల్లు శ్రీనివాస్‌ను బరిలోకి దింపింది. అప్పటికే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి వచ్చిన పాడి కౌశిక్ రెడ్డి టికెట్ ఆశించినా దక్కలేదు. ఈ సారి బీఆర్ఎస్ ఆయనకు టికెట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో తాను ఎలాగైనా గెలవాలని పాడి కౌశిక్ రెడ్డి అనుకుంటున్నారు.