Jagat Prakash Nadda: బీఆర్ఎస్ అంటే భారత రాక్షస సమితి
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా విస్తృతంగా పర్యటించారు. నిజామాబాద్,సంగారెడ్డి ఎన్నికల సభల్లో జేపీ నడ్డా బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు.
సంగారెడ్డి:బీఆర్ఎస్ అంటే భారత రాక్షస సమితి అని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు.గురువారంనాడు సంగారెడ్డిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని జేపీ నడ్డా విమర్శించారు. తెలంగాణను అభివృద్ది వైపు కాకుండా అప్పుల్లోకి తీసుకెళ్లారని కేసీఆర్ సర్కార్ పై ఆయన విమర్శలు చేశారు.
also read:Jagat Prakash Nadda: బీజేపీని గెలిపిస్తే తెలంగాణ రూపు రేఖలు మారుస్తాం
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లను తీసేస్తామని జేపీ నడ్డా తేల్చి చెప్పారు. మియాపూర్ భూములు, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్లను దోచుకున్నారని జేపీ నడ్డా కేసీఆర్ పై ఆరోపణలు చేశారు. కేసీఆర్ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఇచ్చిన హామీని జేపీ నడ్డా ప్రస్తావించారు.కాళేశ్వరం కేసీఆర్ ఏటీఎంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకొనేందుకు కమల దళం అన్ని అస్త్రాలను ప్రయోగిస్తుంది.తెలంగాణలో జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది.ఈ రెండు పార్టీలు తెలంగాణలో కలిసి పోటీ చేస్తున్నాయి. బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తుంది. బీజేపీ, జనసేన అభ్యర్థుల తరపున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో మూడు రోజుల పాటు ప్రచారం నిర్వహించనున్నారు. మోడీతో పాటు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడ ప్రచారం చేసే అవకాశం ఉంది.