Telangana Assembly Elections 2023 : ప్రమాణం చేద్దాం రా .. అంటూ గంగుల సవాల్, స్పందించిన బండి సంజయ్
మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి గంగుల కమలాకర్‌ను సవాల్ చేస్తూ బండి సంజయ్ లేఖ విడుదల చేశారు. కరీంనగర్‌లో ఏ దేవాలయానికి రమ్మన్నా వచ్చేందుకు తాను సిద్ధమని , డబ్బులు పంచలేదని ప్రమాణం చేస్తానని సంజయ్ స్పష్టం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచార పర్వం ముగియగా, మైకులన్నీ సైలెంట్ అవ్వగా, నేతలు ఇళ్లకే పరిమితమవ్వగా కరీంనగర్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి గంగుల కమలాకర్‌ను సవాల్ చేస్తూ బండి సంజయ్ లేఖ విడుదల చేశారు. గంగుల నీ సవాల్‌కు నేను రెడీ.. భాగ్యలక్ష్మీ ఆలయం వద్దకు కేసీఆర్ రమ్మను, కరీంనగర్‌లో ఏ దేవాలయానికి రమ్మన్నా వచ్చేందుకు తాను సిద్ధమని , డబ్బులు పంచలేదని ప్రమాణం చేస్తా ’’ నని బండి సంజయ్ పేర్కొన్నారు.
కాగా.. ధర్మం, దేవుడి పేరుచెప్పి రాజకీయాలు చేసే బిజెపి నేత బండి సంజయ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధర్మంగా గెలవాలని చూస్తున్నాడని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. మళ్లీ ఎక్కడ తన చేతిలో ఓడిపోతానో అని భయపడి అడ్డదారిలో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించి బీజేపీ వాళ్లు డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్నారని అన్నారు. డబ్బులు, మద్యం పంపిణీ చేయలేదని బండి సంజయ్ భాగ్యలక్ష్మి టెంపుల్ లో ప్రమాణం చేస్తారా..? అని గంగుల సవా సవాల్ విసిరారు.
కరీంనగర్ లో సంజయ్ అకృత్యాలు మరీ ఎక్కువయ్యాయని... అతడి తీరుతో ప్రజలు విసిగివేసారి పోయారని గంగుల అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనచేతితో చిత్తుగా ఓడిన సంజయ్ లోక్ సభ ఎన్నికల్లో మాయమాటలు చెప్పి గెలిచాడన్నారు. అతడిని నమ్మి కరీంనగర్ ప్రజలు పార్లమెంట్ కు పంపిస్తే ఏం చేసాడు? నిరాశే మిగిలిందని అన్నారు. ఎంపీగా సంజయ్ ఘోరంగా విఫలం అయ్యారు... అందుకే మూడోసారి ఓడిపోతున్నారని జోస్యం చెప్పారు. దక్షిణ భారతదేశంలోని మొదటిసారిగా హ్యాట్రిక్ విజయం సాధించిన పార్టీగా బిఆర్ఎస్ నిలవనుందని... తెలంగాణలో మూడోసారి అధికారం తమదేనని గంగుల ధీమా వ్యక్తం చేసారు. తాను మంచి మెజార్టీతో నాలుగోసారి విజయం సాధించబోతున్నానని గంగుల పేర్కొన్నారు.
కొత్తపల్లిలో గత రాత్రి చోటుచేసుకున్న ఉద్రిక్తతకు బండి సంజయ్, బిజెపి నాయకులే కారణమన్నారు. బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో వుండి సంజయ్ చాలా దారుణంగా వ్యవహరించారని అన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ బిజెపి డబ్బులు పంచుతుంటే బిఆర్ఎస్ నాయకులు పట్టుకున్నారని తెలిపారు. ఇలా డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయిన సంజయ్ తిరిగి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపైనే దౌర్జన్యానికి దిగాడని అన్నారు. సంజయ్ డబ్బులు పంచుతున్న దృశ్యాలు సిసి కెమెరాల్లో కూడా రికార్డయ్యాయని గంగుల తెలిపారు.
బిఆర్ఎస్ వాళ్లు డబ్బులు పంచుతుంటే పట్టుకున్నామని అంటున్న సంజయ్ వెంటనే పోలీసులకు ఎందుకు పిర్యాదు చేయలేదు? అని గంగుల ప్రశ్నించారు. ఇంట్లోకి చొరబడి మరీ బిఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తావా? అని నిలదీసారు. గూండాలను వెంటపెట్టుకుని తిరుగుతూ దాడులు చేయడమేనా దేశం కోసం... ధర్మం కోసం అంటూ గంగుల కమలాకర్ ఎద్దేవా చేసారు.