తిరిగి బిఆర్ఎస్ సర్కార్ వచ్చినా... ఈసారి కూల్చేయడం ఖాయం : బండి సంజయ్ సంచలనం
బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఏది గెలిచినా ఎక్కువకాలం ప్రభుత్వాన్ని కొనసాగించలేవని... బిజెపితోనే తెలంగాణలో సుస్థిర పాలన సాధ్యమని బండి సంజయ్ అన్నారు.
హైదరాబాద్ : తెలంగాణాలో బిఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చినా ఎక్కువకాలం నిలవదని బిజెపి ఎంపీ, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్నాళ్లకే కూలిపోతుందని... మళ్ళీ ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. బయటివాళ్లు ఎవరో కాదు ఆ పార్టీ అధినేత కేసీఆర్ కుటంబసభ్యులే బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొడతారని... హరీష్ రావో లేదంటే సంతోషో సొంతకుంపటి పెట్టడం ఖాయమని బండి సంజయ్ తెలిపారు.
ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇదే పరిస్థితి వుంటుందని సంజయ్ అన్నారు. ఆ పార్టీలో అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులే... ఎవరికి ఆ పదవి దక్కకున్న అంతర్గత కుమ్ములాటలు మొదలవుతాయని అన్నారు. రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, భట్టి విక్రమార్క వంటివారు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారని... ఎవరో ఒకరు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వాన్ని కూలగొడతారని సంజయ్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి సొంత నాయకుల నుండే కాదు కేసీఆర్ నుండి కూడా ప్రమాదం పొంచివుంటుందని సంజయ్ అన్నారు. కాంగ్రెస్ నుండి గెలిచే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కేసీఆర్ సిద్దంగా వున్నారని అన్నారు. కాంగ్రెస్ నుండి ఇలా గెలవగానే అలా బిఆర్ఎస్ లోకి జంప్ అయ్యేవారే ఎక్కువగా వున్నారన్నారు. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు స్వయంగా కేసీఆర్ ఫండింగ్ చేస్తున్నారని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
Read More రేవంత్ రెడ్డి త్వరలో జైలుకెళ్లడం ఖాయం : కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఇలా బిఆర్ఎస్ లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా కూలిపోవడం ఖాయం... కాబట్టి సుస్థిర ప్రభుత్వం కోసం బిజెపిని గెలిపించాలని బండి సంజయ్ కోరారు. బిజెపిని గెలిపిస్తే ప్రభుత్వం ఐదేళ్లపాటు కొనసాగుతుందని... ప్రజలకు సుపరిపాలన అందుతుందని అన్నారు. కాబట్టి ప్రజలు ఆలోచించి ఓటేయాలని సంజయ్ సూచించారు.
ఇక మంత్రి కేటీఆర్ ప్రజాసేవ చేసేవారికి కాకుండా స్నేహితులకు, బంధువులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చుకుంటున్నారని సంజయ్ ఆరోపించారు. ఖానాపూర్ లో కేటీఆర్ దోస్త్ జాన్సన్ గెలిస్తే నియోజకవర్గ ప్రజలంతా పాస్ పోర్ట్ తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఎందుకంటే ఆయన విదేశాల్లో వుంటాడు కాబట్టి కలవడానికి అక్కడికి వెళ్లాల్సి వుంటుందన్నారు. ఇలా ప్రజలకు దూరంగా వుండేవారిని కాకుండా నిత్యం ప్రజల్లోనే వుండే బిజెపి అభ్యర్థి రాథోడ్ రమేష్ ను గెలిపించాలని బండి సంజయ్ కోరారు.