Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ రెడ్డి త్వరలో జైలుకెళ్ల‌డం ఖాయం : కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR: ''కేసీఆర్ గొంతుక‌ను అణ‌చివేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణకు వస్తున్నారు. ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ, కర్ణాటక నుంచి డీకే శివకుమార్ కూడా వస్తున్నారు. కానీ సింహం లాంటి కేసీఆర్ ఒంటరిగానే పోరాడతారు'' అని కేటీఆర్ అన్నారు.
 

Kodangal Assembly constituency: Revanth Reddy will go to jail soon, says KTR RMA
Author
First Published Nov 9, 2023, 10:45 PM IST

Kodangal Assembly constituency: కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తమ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విజయం సాధిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు (కేటీఆర్) జోస్యం చెప్పారు. గురువారం నియోజకవర్గంలో నిర్వహించిన భారీ రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఇది ఎన్నికల ర్యాలీలా కాకుండా విజయోత్సవ ర్యాలీలా కనిపిస్తోందన్నారు. కొడంగల్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి ప్రజల నుంచి అపారమైన మద్దతు లభించడంతో రేవంత్ రెడ్డి తన నామినేషన్ ను ఉపసంహరించుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డిని రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా అభివర్ణించిన కేటీఆర్.. రేవంత్ రెడ్డికి ఓటేస్తే కొడంగల్ లో ప్లాట్లు తయారు చేసి మొత్తం స్థలాన్ని అమ్మేస్తారనీ, ఆయన నాయకులను కొనగలరు కానీ కొడంగల్ ప్రజలను కొనలేరని అన్నారు.

రేవంత్ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయం..

రేవంత్ రెడ్డి త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలతో మమేకమయ్యే నాయకుడు కావాలా లేక జైలుకు వెళ్లే నాయకుడు కావాలా అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా ఇరుక్కుని కొడంగల్ పేరును చెడగొట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు టికెట్లు అమ్ముకోవడంలో ఫేమస్ అయ్యారన్నారు. కొడంగల్ నుంచి పోటీ చేయాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారనీ, ఆయ‌న్ను ఎదుర్కోవడానికి పట్నం నరేందర్ రెడ్డి చాలు అని కేటీఆర్ అన్నారు. కొడంగల్ లో నలుగురు సర్పంచ్ లకు కోటి రూపాయలు ఇస్తానని రేవంత్ రెడ్డి ఆఫర్ ఇచ్చారని రోడ్ షోలో కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రతిపాదనను తిరస్కరించి పోలీసులను అప్రమత్తం చేసిన సర్పంచ్ ను ఆయన అభినందించారు.

ఎంతమంది వచ్చినా కేసీఆర్ సింగిల్ గానే.. 

ఇటీవల తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ రైతులకు నాలుగు గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోందని చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అదే చేస్తుందని రైతులు భయపడుతున్నారని ఆయన అన్నారు. కర్ణాటక రైతులు తెలంగాణకు వస్తున్నారనీ, తమ రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఎన్నుకోవడం పొరపాటని, ఇది ప్రస్తుత సమస్యను మరింత తీవ్రతరం చేసిందని చెబుతున్నార‌ని కేటీఆర్ అన్నారు. అలాగే, బీజేపీని టార్గెట్ చేస్తూ.. కేసీఆర్ గొంతును అణ‌చివేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణకు వస్తున్నారన్నారు. ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ, కర్ణాటక నుంచి డీకే శివకుమార్ కూడా వస్తున్నారన్నారు. కానీ సింహం లాంటి కేసీఆర్ ఒంటరిగానే పోరాడతారని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios