Telangana Election Results: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వద్దకు ఏపీ సీఎం జగన్ దూత?
రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం జగన్ నుంచి రాయబారం వెళ్లినట్టు మీడియాలో ఓ కథనం చక్కర్లు కొడుతున్నది. జగన్ సంస్థలకు చెందిన ఓ ఉన్నత ఉద్యోగి ఎన్నికలకు ఒక రోజు ముందు రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారని, జగన్ మాట్లాడటానికి ఫోన్ డయల్ చేస్తుండగా రేవంత్ రెడ్డి సున్నితంగా తిరస్కరించారనేది ఆ కథనం సారాంశంగా ఉన్నది.
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉన్నది. తెలంగాణ ఎన్నికలకు ముందే ఏపీ టాపిక్ ఇక్కడ సంచలనమైన సంగతి తెలిసిందే. నాగార్జున సాగర్ విషయమై ఇప్పటికీ టెన్షన్ వాతావరణమే ఉన్నది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు పొరుగు రాష్ట్రంపై అంతో ఇంతో ప్రభావం వేస్తూనే ఉంటాయి. అందుకే ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలు సఖ్యంగా ఉండటానికే మొగ్గు చూపుతూ ఉంటాయి. లేదంటే.. పరస్పరం సహకరించే ధోరణి అవలంభిస్తాయి. అంతే తప్పితే డ్యామేజీ చేసుకున్న పరిణామాలు చాలా తక్కువగా ఉన్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే మొగ్గుచూపడంతో రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఏపీ నుంచి కూడా కాంగ్రెస్‌కు రాయబారాలు జరుగుతున్నట్టు సమాచారం. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దూత ఇటీవలే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసినట్టు కొన్ని వర్గాలు తెలిపాయి. ఎన్నికలకు ఒక రోజు ముందు రాత్రి జగన్ సంస్థలకు చెందిన ఓ ఉన్నత ఉద్యోగి రేవంత్ రెడ్డిని కలిసినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై జగన్ సర్వే చేపట్టారని, అందులో కాంగ్రెస్‌కు 72 స్థానాలు వస్తాయనే అంచనా వచ్చినట్టు ఆ దూత.. రేవంత్‌కు తెలిపారని, అందుకుగాను ఏపీ సీఎం జగన్ కాంగ్రెస్ పార్టీకి అభినందనలు చెబుతున్నట్టుగా ఆయన వివరించారని మీడియాలో ఓ కథనం వచ్చింది. అంతేకాదు, రేవంత్ రెడ్డితో జగన్ మాట్లాడుతారని ఆయన ఫోన్ కలుపుతుండగా టీపీసీసీ చీఫ్ వారించి తర్వాత మాట్లాడుదామని సున్నితంగా తిరస్కరించారని ఆ కథనం పేర్కొంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపించడంతో నిన్నా మొన్నటి వరకు క్లోజ్‌గా మూవ్ అయిన బీఆర్ఎస్‌ను వదిలి కాంగ్రెస్ వైపు సీఎం జగన్ మొగ్గారనేది ఆ కథనం సారాంశం.
Also Read: Tamil Nadu: కంచే చేను మేస్తే.. రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఈడీ అధికారి
ఈ కథనం ఇప్పుడు సంచలనమవుతున్నది. ఎందుకంటే కేసీఆర్, కేటీఆర్‌తో ఏపీ సీఎం జగన్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. అదీగాక, జగన్ పార్టీకి ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీతో రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉంటాయనే వాదనలు ఉన్నాయి. అందుకే ఏపీ సీఎం జగన్.. రేవంత్ రెడ్డికి రాయబారం పంపినట్టు వస్తున్న కథనాలపైనా అనుమానాలు ఉన్నాయి. అయితే, రాజకీయాలు ఏ క్షణంలో ఏ మలుపైనా తీసుకోవచ్చనే వాదన మరోవైపు వస్తూనే ఉన్నది.
కానీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ అవకాశాలు కనిపించడంపై ఏపీలో టీడీపీ శ్రేణులు ఆనందంగా ఉన్నట్టు తెలుస్తున్నది. జగన్ పార్టీకి మిత్రులైన బీఆర్ఎస్ పోవడం, కాంగ్రెస్ ద్వారా చంద్రబాబు.. కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారనే సంతృప్తి టీడీపీ వర్గాల్లో ఉన్నది. అదీగాక, ఒక వేళ తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి అయితే ఆయన చంద్రబాబు నాయుడిపై గౌరవంతో ఉంటారనేది వారి ఆశగా కనిపిస్తున్నది.