Tamil Nadu: కంచే చేను మేస్తే.. రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఈడీ అధికారి

తమిళనాడులో ఓ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారి రూ. 20 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. రాష్ట్ర విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ అధికారులు ఆయనపై కేసు నమోదు చేసి ఆయనకు సంబంధించిన ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
 

ED Officer caught red handed while taking rs 20 lakh bribe in tamil nadus dindigul kms

చెన్నై: ఆర్థిక అక్రమాలకు పాల్పడిన వారిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తుంది. కానీ, ఈ దర్యాప్తు సంస్థకు చెందిన అధికారే అడ్డ దారి తొక్కితే? కంచెనే చేను మేసిన చందంగా మారిపోతుంది. తమిళనాడులో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఈడీ అధికారి రూ. 20 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అంతేకాదు, లంచం తీసుకోవడానికి బాధితుడిని బెదిరించడానికి ప్రధాని మోడీ పేరును ప్రస్తావించడం గమనార్హం.

తమిళనాడులోని దిండిగల్‌లో ఓ ప్రభుత్వ ఉద్యోగి నుంచి ఈడీ అధికారి అంకిత్ తివారీ లంచం తీసుకున్నాడు. దీంతో రాష్ట్ర విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్(డీవీఏసీ) సంస్థ రంగంలోకి దూకింది. అంకిత్ తివారీని జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకుని ఆయనకు సంబంధించిన ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. మదురైలోని ఈడీ ఆఫీసు సహా అంకిత్ తివారీ నివాసంలోనూ సెర్చ్ నిర్వహించింది. పలు దస్త్రాలను సీజ్ చేసుకున్న అధికారులు.. అంకిత్ తివారీతో సంబంధాలున్న మధురై, చెన్నై ఈడీ ఆఫీసులోని మరికొందరు ఈడీ అధికారులపై తనిఖీలు చేసే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Sabitha Indra Reddy: దేశంలోనే తొలి మహిళా హోం మంత్రి.. విజయానికి కేరాఫ్ సబితా ఇంద్రారెడ్డి

ఎలా దొరికాడు?

అక్టోబర్ 29వ తేదీన అంకిత్ తివారీ దిండిగల్‌లోని ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఆశ్రయించాడు. ఆ ఉద్యోగిపై డీవీఏసీ ఓ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. ఆ కేసును తర్వాత క్లోజ్ చేసింది. ఈ కేసు ఆధారంగానే అంకిత్ తివారీ కుట్రకు తెరతీశాడు. ఆ కేసులో దర్యాప్తు చేయాలని ప్రధాని మోడీ కార్యాలయం తమకు ఆదేశాలు జారీ చేసినట్టు అంకిత్ తివారీ.. ఆ ఉద్యోగిని బెదిరించాడు.

అక్టోబర్ 30వ తేదీన మదురైలోని ఈడీ ఆఫీసుకు రావాలని ఆదేశించాడు. ఈడీ ఆఫీసుకు వచ్చిన తర్వాత ఆ ఉద్యోగిని అంకిత్ తివారీ రూ. 3 కోట్ల లంచం అడిగాడు. తాను సీనియర్ అధికారులతో మాట్లాడానని, వారు ఈ లంచాన్ని రూ. 51 లక్షలకు తగ్గించడానికి అంగీకరించారని చెప్పాడు. నవంబర్ 1వ తేదీన ఆ ఉద్యోగి తొలి ఇన్‌స్టాల్‌మెంట్ కింద రూ. 20 లక్షలు ఈడీ అధికారికి అందించాడు.

Also Read: DK Shivakumar: కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కునే ప్రయత్నాలు కేసీఆర్ మొదలుపెట్టారు: డీకే శివకుమార్ సంచలనం

ఆ తర్వాత మిగిలిన పేమెంట్ చేయాలని, ఈ అమౌంట్ మొత్తాన్ని తమపై అధికారులతో పంచుకోవాల్సి ఉంటుందని అంకిత్ తివారీ డిమాండ్ చేశాడు. లేదంటే.. కఠిన చర్యలు తీసుకుంటామని బెదిరించాడు. అంకిత్ తివారీ డిమాండ్లపై అనుమానం కలిగిన ఆ ఉద్యోగి దిండిగల్‌లోని డీవీఏసీ యూనిట్‌ను నవంబర్ 30వ తేదీన ఆశ్రయించాడు.

అంకిత్ తివారీ తన అధికారాలను దుర్వినియోగం చేశాడని ప్రాథమిక విచారణలో తేలింది. ఆయనపై కేసు నమోదు చేశారు. డిసెంబర్ 1వ తేదీన రెండో ఇన్‌స్టాల్‌మెంట్ లంచం తీసుకుంటుండగా అంకిత్ తివారీ అడ్డంగా బుక్కయ్యాడు. మదురై, చెన్నైలోని ఈడీ అధికారులూ ఈ కేసుతో లింక్ ఉన్నట్టు దర్యాప్తులో తేలుతున్నట్టు కొన్ని వర్గాలు తెలిపాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios