హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని తెలంగాణ టీడీపీ నేతలు నిర్ణయం తీసుకొన్నారు. పోటీకి దూరంగా ఉండాలనే నిర్ణయాన్ని పార్టీకి చెందిన కొందరు నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. క్యాడర్‌ను కాపాడుకొనేందుకు పోటీ చేయాలని  డిమాండ్ తెరమీదకి తీసుకువచ్చారు. తెలంగాణలో పార్టీ ఆవిర్భావం నుండి సాధారణ ఎన్నికలకు దూరంగా ఉండడం 37 ఏళ్లలో ఇదే తొలిసారి

తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈ సీట్లలో కనీసం ఐదు ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలని ఆ పార్టీ నేతలు తొలుత భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు ఆర్‌సీ కుంతియా టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణకు ఫోన్ చేసి మద్దతు విషయమై అడిగారు. మరో వైపు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడ ఈ నెల 23వ తేదీన రమణతో భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు.

ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని తెలంగాణ టీడీపీ నేతలు నిర్ణయం తీసుకొన్నారు. అయితే ఆదివారం నాడు పోటీకి దూరంగా ఉండాలనే నిర్ణయంపై కొందరు టీటీడీపీ నేతలు సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని కొత్తకోట దయాకర్ రెడ్డి,  బండ్రు శోభారాణి, ఎంఎన్ శ్రీనివాస్ లాంటి నేతలు కోరారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుమారు 34 మంది కూడ ధరఖాస్తులు చేసుకొన్నారు.

ఈ విషయమై రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై తెలంగాణ నేతలు చంద్రబాబుకు నివేదికను పంపారు. ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నట్టు టీడీపీ  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ సోమవారం నాడు ప్రకటనను విడుదల చేశారు. బీజేపీ, టీఆర్ఎస్‌ పార్టీలకు వ్యతిరేకంగా ఈ ఎన్నికల్లో పనిచేయాలని కోరారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉంది. ఆ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల తర్వాత ప్రతి ఎన్నికల్లో పోటీ చేయాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు. కానీ, తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉంది. పార్టీ ఆవిర్భవించిన 37 ఏళ్లలో పోటీకి దూరంగా ఉండడం బహుశా ఇదే తొలిసారి.

సంబంధిత వార్తలు

తెలంగాణలో కాంగ్రెస్‌కు మద్దతు: టీటీడీపీ నేతల్లో విభేదాలు

తెలంగాణలో పోటీకి టీడీపీ దూరం: ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు