హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని టీడీపీ  డిసైడ్ అయింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరిన మీదట టీడీపీ నాయకులు పోటీకి దూరంగా ఉండాలని భావించారు.

గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, జనసేనలు ప్రజాకూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. కాంగ్రెస్ పార్టీకి 19, టీడీపీకి 2 అసెంబ్లీ సీట్లు దక్కితే, సీపీఐ, జనసేనకు ఒక్క సీటు కూడ దక్కలేదు.

కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 9 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆ పార్టీ నుండి టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించారు. ఒక్క టీడీపీ ఎమ్మెల్యే కూడ టీఆర్ఎస్‌ గూటికి చేరేందుకు సిద్దమయ్యారు.

ఇదిలా ఉంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం నాలుగు ఎంపీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయాలని తొలుత భావించింది. కానీ, ఈ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం టీడీపీ నేతలను కోరింది. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ జాతీయనాయకులు ఆర్‌సీ కుంతియా టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ‌కు ఫోన్ చేశారు.

శనివారం నాడు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కమార్ రెడ్డి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మండవ వెంకటేశ్వరరావులతో చర్చించారు. 

ఈ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది. కనీసం తమ పార్టీ క్యాడర్‌ను కాపాడుకొనే ఉద్దేశ్యంతో కనీసం 4 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకొన్న టీడీపీ.. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.

ఇదిలా ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ విషయమై టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఖమ్మంతో పాటు కొన్ని పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని టీడీపీ భావించింది. కానీ, కాంగ్రెస్ నేతలు మద్దతు కోరిన నేపథ్యంలో పోటీకి దూరంగా ఉండాలనే అభిప్రాయంతో ఆ పార్టీ నేతలు ఉన్నట్టు సమాచారం.