Weekly roundup: సెప్టెంబ‌ర్ నెల చివ‌రికి చేరింది. గ‌త వారం దేశ‌, విదేశాల్లో ప‌లు కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌రిగిన కొన్ని కీల‌క అంశాలు ఈ వారం వీక్లి రౌండ‌ప్‌లో చూసేద్దాం. 

భారతీలయుల ఆశలపై నీళ్లు జల్లిన ట్రంప్

అమెరికాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా టారిఫ్‌ల పేరుతో విరుచుకుప‌డ్డ ట్రంప్ ఈసారి హెచ్‌1 బీ వీసా దారుల‌కు షాక్ ఇచ్చారు. హెచ్‌-1బీ వీసాపై భారీ రుసుం విధించారు. ఇక నుంచి ఒక్కో వీసాకు ఏటా లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం భారత్‌, చైనాపై ఎక్కువ ప్రభావం చూపనుంది. యూఎస్‌ కామర్స్‌ సెక్రటరీ హోవార్డ్‌ లుట్నిక్‌ ప్రకారం, ‘‘మనకున్న ప్రతిభను వినియోగించుకోవాలి. ఉద్యోగాలు విదేశీయులకు కాకుండా అమెరికన్లకే రావాలి’’ అని స్పష్టం చేశారు. 1990లో ప్రవేశపెట్టిన హెచ్‌-1బీ వీసాలతో ఇప్పటివరకు ఇండియా (71%), చైనా (11.7%) నిపుణులు పెద్ద సంఖ్యలో అమెరికాలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఏటా 85 వేల వీసాలు లాటరీ విధానం ద్వారా ఇస్తారు. కంపెనీలు ఈ ఖర్చులను భరించేవి, కానీ కొత్త రుసుం వాటిపై భారమవనుంది.

ఆంధ్రప్రదేశ్‌లో మెడిక‌ల్ కాలేజీల ర‌గ‌డ

ఆంధ‌ప్ర‌దేశ్‌లో ఈ వారం మెడిక‌ల్ కాలేజీల వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న నూత‌న ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల నిర్మాణాన్ని పీపీపీ ప‌ద్ధ‌తిలో చేప‌డుతామ‌ని కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌డంతో వివాదాని నాంది ప‌డింది. వైసీపీ హ‌యాంలో మొద‌లు పెట్టిన మెడిక‌ల్ కాలేజీల‌ను కూట‌మి ప్ర‌భుత్వం ప్రైవేటుప‌రం చేస్తోంద‌ని వైసీపీ ఆరోపిస్తోంది. ఇందులో భాగంగా ఛ‌లో మెడిక‌ల్ కాలేజీల పేరుతో నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. అయితే వైసీపీ ఆరోపణలపై టీడీపీ రివర్స్ అటాక్ చేస్తోంది. జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీలకు పునాది కూడా పడదలేదంటున్నారు. 17 కాలేజీలకు రూ. 8480 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా.. జగన్ ఐదేళ్లలో కేవలం రూ. 476 కోట్లే ఖర్చు చేశారని ఆరోపిస్తున్నారు. ఏపీలో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా కూట‌మి ప్ర‌భుత్వం అడుగులు వేస్తోంద‌ని చెబుతున్నారు. మ‌రి ఈ వివాదం ఎలాంటి మ‌లుపు తిరుగుతుందో చూడాలి.

తెలంగాణ‌లో గ్రూప్‌1 పంచాయ‌తీ

ఇక తెలంగాణ విష‌యానికొస్తే ఈ వారం గ్రూప్‌1 పంచాయ‌తీ న‌డిచింది. ప‌రీక్ష‌ల మూల్యాంక‌నంలో అక్ర‌మాలు జ‌రిగాయంటూ కొంద‌రు హైకోర్టును ఆశ్ర‌యించ‌డంతో వివాదం మొద‌లైంది. త‌మ జ‌వాబు ప‌త్రాల‌ను రీవాల్యుయేష‌న్ చేయాల‌ని లేదంటే గ్రూప్‌1 ర‌ద్దు చేసి మ‌ళ్లీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించేలా ఆదేశాలు ఇవ్వాల‌ని న్యాయ‌స్థానాన్ని కోరారు. గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నిర్వహించిన మెయిన్స్‌ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని తెలంగాణ హైకోర్టు తేల్చింది. 12,381మంది అభ్యర్థులు ఇంగ్లీషులో రాస్తే 506 మంది ఎంపికయ్యారని, తెలుగులో 8,694 మంది హాజరైతే కేవలం 56 మందే ఎంపికయ్యారని, ఉర్దూలో 10 మందికి ఒకరు ఎంపికయ్యారని ధర్మాసనం గుర్తుచేసింది. తెలుగులో రాస్తే మూ ల్యాంకనం సరిగ్గా జరగలేదని, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు ఇంగ్లిష్‌, తెలుగు మాధ్యమాల్లో బోధన చేస్తారని, వాళ్లే మూల్యాంకనం చేశారని కమిషన్‌ చెప్పిందన్నది. ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూలో నిపుణులే మూ ల్యాంకనం చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే గ్రూప్ 1 అంశంపై హైకోర్టు డివిజన్ బెంచ్‌ను టీజీపీఎస్సీ ఆశ్రయించింది. గ్రూప్ పరీక్షల్లో జరిగిన అవకతవకల పట్ల సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ వద్ద పిటిషన్ దాఖలు చేసింది.

రాహుల్ ఓట్ల దొంగతనం ఆరోపణలు

రాహుల్‌ గాంధీ ఓట్ల దొంగతనం ఆరోపణలతో మరోసారి వివాదం రేపారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ మద్దతుదారుల ఓట్లు తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ వాడుతోందని ఆయన ఆరోపించారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఫేక్‌ ఐడీలతో ఓట్లు తొలగించారని, సీఐడీకి ఆధారాలు ఇవ్వలేదని ఈసీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈసీ మాత్రం రాహుల్‌ ఆరోపణలను ఖండిస్తూ, ‘‘ఆన్‌లైన్‌లో ఓట్లు తొలగించడం అసాధ్యం’’ అని స్పష్టం చేసింది. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఓట్ల తొలగింపు కేసులో అధికారులే ఫిర్యాదు చేశారని గుర్తుచేసింది. బీజేపీ కూడా రాహుల్‌ను విమర్శిస్తూ, ‘‘ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచే కుట్ర చేస్తున్నాడు’’ అని ఆరోపించింది. ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్లాలని సూచించింది. అయితే రాహుల్ మాత్రం ‘‘ఓటు హక్కు దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తా’’ అని ప్రకటించారు.

ఆసియా క‌ప్‌లో కొన‌సాగుతోన్న టీమిండియా జైత్ర‌యాత్ర

ఆసియా క‌ప్ 2025లో టీమిండియా జైత్ర‌యాత్ర కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన 3 మ్యాచ్‌లో విజ‌యాన్ని సాధించి మ‌న ప్లేయ‌ర్స్ స‌త్తా చాటారు. ఈ వారంలో పాకిస్థాన్‌, ఒమాన్‌ల‌తో జ‌రిగిన మ్యాచ్‌ల్లో టీమిండియా ఘ‌న విజ‌యాన్ని సాధించి హ్యాట్రిక్ విజ‌యాన్ని అందుకుంది. కాగా ఆసియా కప్‌లో గ్రూప్‌ దశకుతెర‌ప‌డింది. గ్రూప్‌-బి నుంచి సూపర్‌-4 బెర్తులు దక్కించుకున్న శ్రీలంక, బంగ్లాదేశ్‌ శనివారం తొలి పోరులో తలపడనున్నాయి.