దేశీయంగా ఇంటర్నెట్‌లో మరోసారి మాల్వేర్​ కలకలం రేపుతోంది. ఆదాయం పన్ను శాఖ పేరిట మోసపూరిత ఈ-మెయిల్స్​తో పన్ను చెల్లిపుదార్ల విలువైన సమాచారాన్ని సేకరిస్తోంది ఈ వైరస్. ఇలాంటి మెయిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదాయం పన్ను శాఖ అధికారులు, సైబర్​ సెక్యూరిటీ సంస్థలు ఇంటర్నెట్​ వినియోగదారులను హెచ్చరిస్తున్నాయి.

దేశంలో ఆన్​లైన్​ నేరగాళ్లు హ్యాకింగ్​ కోసం కొత్త దారులు వెతుకుతున్నట్లు ఓ సైబర్​ సెక్యూరిటీ సంస్థ గుర్తించింది. ఆదాయ పన్ను శాఖ పేరుతో మెయిల్స్ పంపి హ్యాకింగ్​కు పాల్పడుతున్నట్లు ఇంటర్నెట్ యూజర్లను హెచ్చరించింది. 

"ఓ మోసపూరిత మాల్వేర్​ ఈ నెల 12 నుంచి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. వ్యక్తులు, ఆర్థిక సంస్థలే లక్ష్యంగా.. ఆదాయం పన్ను శాఖ​ పేరుతో ఈ మాల్వేర్ నకిలీ మెయిల్స్ పంపిస్తోంది’ అని ఇండియన్​ కంప్యూటర్​ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్​ (సీఈఆర్​టీ) తెలిపింది. 

ఇండియన్​ కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్​ దేశ ఇంటర్నెట్ డొమైన్​లో మాల్వేర్​లు, హ్యాకింగ్, ఫిషింగ్​ వంటి కార్యకలాపాలను గుర్తించే సంస్థ. మాల్వేర్​ పంపిస్తున్న రెండు రకాల మోసపూరిత మెయిల్స్​ను సీఈఆర్​టీ గుర్తించింది.

మొదటి రకం ‘.ఐఎంజీ’, రెండో రకం ‘.పీఐఎఫ్’ అనే ప్రమాదకర ఫైళ్లను జోడిస్తున్నారు. అటుపై ఇన్ కం టాక్స్ ఇండియా {.} ఇన్ ఫో అనే మోసపూరిత డొమైన్​ ద్వారా మెయిల్స్ పంపిస్తున్నట్లు సీఈఆర్​టీ తెలిపింది. 

ఈ ఫైళ్లు డౌన్​లోడ్ చెసుకోవడం ద్వారా ఆ మాల్వేర్ విలువైన సమాచారాన్ని చోరీ చేసి హ్యాకర్లకు పంపిస్తున్నట్లు పేర్కొంది. అయితే ప్రస్తుతం ఈ ప్రమాదకర డొమైన్​ను నిర్వీర్యం చేసినట్లు సీఈఆర్​టీ వెల్లడించింది. 

‘ప్రమాదకర మెయిల్స్, ఫైల్స్ వచ్చినట్లు గుర్తిస్తే వాటిని ఎట్టిపరిస్థితుల్లో తెరవద్దు. ఎంఎస్​ ఆఫీస్​లో ఆటోమేటిక్​గా నడిచే విండోలను డిసేబుల్​ చేయాలి. అనుమానిత యూఆర్​ఎల్​లపై క్లిక్​ చేయొద్దు. ఒక వేళ ఏదైనా వాస్తవిక యూఆర్​ఎల్​తో సందేశాలు వస్తే... మెయిల్​ పంపిన సంస్థ వెబ్​సైట్​లోకి వెళ్లి కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవాలి’ అని సీఈఆర్టీ చెబుతోంది.

ప్రమాదకర మాల్వేర్​ సంచరిస్తున్న నేపథ్యంలో.. ఇంటర్నెట్ యూజర్లు తమ ఫైలింగ్​, రీఫండ్​ సహా ఆదాయం పన్ను శాఖతో ఉండే ఇతర సంబంధాలపై అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఐటీ అధికారి ఒకరు సూచించారు. ఆదాయం పన్ను, బ్యాంకింగ్ వివరాల గురించి ఏవైనా అనుమానించదగ్గ మెయిల్స్ వస్తే.. వాటి నుంచి ఎలా రక్షించుకోవాలనే అంశంపై అనేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.