బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లేమి నష్టపోకుండా 24 పరుగులు చేసింది.  

ఓపెనర్లు మార్కస్ హరీస్ 19, ఉస్మాన్ ఖవాజా 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకు ముందు 4 వికెట్ల నష్టానికి 303 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌ 7 వికెట్లు కోల్పోయి 622 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను ఢిక్లేర్ చేసింది.

ఆట ప్రారంభించి వెంటనే పుజారాతో కలిసి మొదటి రోజు వికెట్ల పతనాన్ని అడ్డుకున్న హనుమ విహరి 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. వీరిద్దరూ 5వ వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మరోవైపు క్రీజులో పాతుకుపోయిన పుజారా ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ డబుల్ సెంచరీకి చేరువయ్యాడు..

కానీ దురదృష్టవశాత్తూ లేయన్ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. ఆ తర్వాత వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌండరీలు సిక్సర్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డ పంత్ ఈ క్రమంలో 150 పరుగులు పూర్తి చేసుకుని డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు.

137 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న రిషబ్ పంత్ ఆ తర్వాత అర్థసెంచరీ పూర్తి చేసుకోవడానికి మరో 47 బంతులు మాత్రమే తీసుకున్నాడు. ఇతనికి జోడిగా రవీంద్ర జడేజా సైతం బ్యాట్ ఝళిపించడంతో స్కోరు బోర్డు పరుగులు పెడుతోంది.

వీరిద్దరూ 7వ వికెట్‌కు 204 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం 81 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా ఔటయ్యాడు. అతని నిష్క్రమణ తర్వాత టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు.

ఆ సమయానికి భారత్ 167.2 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 622 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 159 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లేయన్ 4, హేజిల్ వుడ్ 2, మిచెల్ స్టార్క్ 1 వికెట్ పడగొట్టారు. 

సిడ్నీ టెస్ట్: ముగిసిన తొలి రోజు ఆట, భారత్ 303/4

మయాంక్ రికార్డుల మోత

సచిన్ ముందు, వెనుక స్థానాలు పుజారావే...

పింక్ గ్లౌవ్స్, బ్యాట్‌తో బరిలోకి దిగిన కోహ్లీ ...విశేషమేంటబ్బా?

నల్లటి బ్యాడ్జీలతో గ్రౌండ్‌లోకి దిగిన ఆసీస్, భారత్ క్రికెటర్లు...ఎందుకంటే

పుజారా రికార్డు: దిగ్గజాల జాబితాలో చోటు