ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో వరుస విజయాలతో దూసుకుపోతున్న బెంగాల్ వారియర్స్, దబాంగ్ డిల్లీల మధ్య ఇవాళ(సోమవారం) రసవత్తర పోరు జరిగింది. అయితే ఇందులో బెంగాల్ దే పైచేయిగా నిలిచింది. కేవలం 9 పాయింట్ల తేడాతో వెనుకబడి డిల్లీ ఓటమిని చవిచచూసింది. ఇలా టాప్ జట్ల మధ్య సాగిన ఉత్కంఠభరితంగా సాగిన పోరుకు పంచకుల  తావు దేవిలాల్ ఇండోర్ స్టేడియం వేదికయ్యింది. 

బెంగాల్ వారియర్స్ ఆటగాళ్లలో మణీందర్ సింగ్ సూపర్ టెన్ తో చెలరేగాడు. మొత్తంగా అతడు 15 పాయింట్లు సాధించగా సుఖేష్ హెగ్డే 7, ఇస్మాయిల్ 5, బల్దేవ్ 3, రాకేష్ 3, మయూర్ 2, రింకు 2 పాయింట్లతో తమ వంతు సహకారం అందించారు. దీంతో వారియర్స్ రైడింగ్ లో 28, ట్యాకిల్స్ లో 8, ఆలౌట్ల ద్వారా 6 మొత్తంగా 42 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. 

ఇక దబాంగ్ డిల్లీ విషయానికి వస్తే రైడింగ్ లో 23, ట్యాకిల్స్ లో 6, ఆలౌట్ల ద్వారా 2, ఎక్స్‌ట్రాల రూపంలో మరో 2 మొత్తంగా 33 పాయింట్లు మాత్రమే సాధించగలిగింది. ఆటగాళ్లలో నవీన్ 15 పాయింట్లతో అత్యుత్తమ ప్రదర్శన చేసినా జట్టును గెలిపించుకోలేకపోయాడు. అలాగే రజిత్ 6, అనిల్ 3, వినయ్ 2, రవీందర్ 2 పాయింట్లు సాధించినా లాభం లేకుండా పోయింది. 9 పాయింట్ల తేడాతో బెంగాల్ చేతిలో డిల్లీ ఓటమిని చవిచూసింది.