Asia Cup 2025 Hockey Final : ఆసియా కప్ 2025లో చైనాపై 7-0తో ఇండియా ఘన విజయం సాధించింది. దీంతో భారత హాకీ జట్టు తొమ్మిదోసారి ఫైనల్‌కు చేరింది. ఇప్పుడు ఫైనల్లో కొరియాతో తలపడనుంది.

Asia Cup 2025 Hockey Final : ఆసియా కప్ 2025లో భారత హాకీ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. సూపర్-4 రౌండ్‌లో చివరి మ్యాచ్‌లో చైనాపై 7-0 తేడాతో గెలిచి ఫైనల్‌లో తన స్థానం ఖరారు చేసుకుంది. రాజగిర్‌లో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో భారత్ తొమ్మిదోసారి ఫైనల్‌కు చేరింది.

టోర్నమెంట్ ప్రారంభం నుంచి భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. పూల్ స్టేజ్‌లో అగ్రస్థానంలో నిలిచి సూపర్-4లో ప్రవేశించింది. ఇక్కడ కూడా భారత్ మూడు మ్యాచ్‌లలో రెండు గెలిచి, ఒకటి డ్రా చేసింది. ఆరు మ్యాచ్‌లలో ఐదు విజయాలు సాధించి, ఒకదానిని సమం చేసింది. దీంతో సూపర్-4లో కూడా అగ్రస్థానంలో నిలిచింది.

చైనాపై 7-0 తో భారత్ విజయం

చైనాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ప్రారంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. 3వ నిమిషంలో శిలానంద్ లక్రా తొలి గోల్ సాధించాడు. 6వ నిమిషంలో పీనాల్టీ కార్నర్‌ను ఉపయోగించి దిల్ ప్రీత్ సింగ్ రెండో గోల్ చేశాడు. 17వ నిమిషంలో మరో పీనాల్టీ కార్నర్‌ను మన్ దీప్ సింగ్ గోల్‌గా మార్చి భారత్‌కు 3-0 ఆధిక్యం ఇచ్చాడు.

రెండో అర్ధ భాగంలో కూడా భారత్ ఆధిపత్యం కొనసాగింది. 36వ నిమిషంలో రాజ్‌కుమార్ పాల్ గోల్ చేసి స్కోరును 4-0కి తీసుకెళ్లాడు. 38వ నిమిషంలో సుఖ్జీత్ సింగ్ గోల్ చేసి 5-0గా మార్చాడు. చివరి క్వార్టర్‌లో అభిషేక్ 45వ, 49వ నిమిషాల్లో రెండు గోల్స్ చేసి భారత్ స్కోర్ ను 7-0గా ఖరారు చేశాడు. చైనా ఒక్క గోల్ చేయకుండానే ఓటమిపాలైంది.

ఫైనల్‌లో కొరియాతో భారత్ పోరాటం

ఇప్పుడి వరకు ఈ టోర్నమెంట్‌ను దక్షిణ కొరియా ఐదుసార్లు గెలిచింది. భారత్ మూడు సార్లు విజేతగా నిలిచింది. ఈసారి నాలుగో టైటిల్ కోసం పోరాటం చేయనుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భారత్-కొరియా ఫైనల్‌లో తలపడటం ఇది నాలుగోసారి. గత మూడు ఫైనల్స్‌లో రెండుసార్లు కొరియా, ఒకసారి భారత్ విజేతలుగా నిలిచాయి. ఈసారి భారత్‌ చరిత్ర సృష్టించాలని టార్గెట్ పెట్టుకుంది.

వరల్డ్ కప్ టోర్నీకి నేరుగా భారత్ ఎంట్రీ ఇస్తుందా?

ఆసియా కప్ విజేత జట్టుకు వచ్చే సంవత్సరం జరిగే హాకీ వరల్డ్ కప్‌లో నేరుగా ప్రవేశం లభిస్తుంది. అందువల్ల రాజగిర్‌లో జరగబోయే ఫైనల్ మ్యాచ్ భారత్ హాకీకి అత్యంత కీలకంగా నిలవనుంది. జట్టు ఇప్పటివరకు అద్భుత ప్రదర్శన చేసింది. దీంతో భారత అభిమానులు జట్టు విజయంపై నమ్మకంగా ఉన్నారు.

Scroll to load tweet…