ప్రపంచాన్ని కరోనా వైరస్ ఊపేస్తోంది. ప్రజలు ఆ పేరు చెబితేనే వణికి పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పంజా విసురుతున్న కరోనా వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఆంక్షలు విధిస్తూ, ప్రజలను చైతన్య పరుస్తూ భగవంతుడిపై భారం వేసాయి. 

ఈ నేపథ్యంలో అన్ని స్పోర్టింగ్ ఈవెంట్స్ పైనా కరోనా వైరస్ ప్రభావం ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఐపీఎల్ ఇప్పటికే వాయిదా పడింది. క్రికెట్ సిరీస్ లు రద్దయ్యాయి. టోక్యో ఒలింపిక్స్ పైన కూడా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 

ఈ కరోనా వైరస్‌ ప్రభావం టోక్యో ఒలింపిక్స్‌పైనే కాకుండా టోక్యో ఒలింపిక్స్‌ జ్యోతి అందజేత కార్యక్రమానికి సైతం అంటుకుంది.  ఒలింపిక్‌ క్రీడల సంప్రదాయం ప్రకారం 1896లో తొలిసారి ఒలింపిక్స్‌ జరిగిన గ్రీస్ లోని ఒలింపియా స్టేడియం నుంచి ప్రతి ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు జ్యోతి అందజేత కార్యక్రమం జరుగుతుంది. 

Also read; కరోనా దెబ్బ: ఐపీఎల్ వాయిదా...కొత్త ఆరంభ తేదీ ఇదే!

ఒలింపిక్స్‌ ఆతిథ్య నగరానికి ఒలింపిక్ జ్యోతిని ఇక్కడి నుండి అందించడం ఆనవాయితీ. ది సెంట్రల్‌ ఏథెన్స్‌ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి వేలాదిగా అభిమానులు తరలి వస్తారు. 

కానీ కరోనా వైరస్ ప్రబలంగా విస్తరిస్తున్న వేళ గ్రీస్ సర్కార్ ఈ కార్యక్రమంపై తీవ్రమైన ఆంక్షలు విధించింది. ఇప్పటికే గ్రీస్‌లో కరోనా వైరస్‌ కేసులు 228కి చేరుకున్నాయి. దీంతో గ్రీస్‌ ఒలింపిక్‌ సంఘం ఒలింపిక్‌ జ్యోతి అందజేసే కార్యక్రమంపై ఆంక్షలు విధించింది. 

ఒలింపిక్ జ్యోతిని వెలిగించిన తరువాత ఆ జ్యోతిని తొలుత గ్రీస్ లో ర్యాలీగా వివిధ నగరాలలో తిప్పి అప్పుడు ఆతిథ్య దేశానికి అందజేస్తారు. ఈ సారి జరిగే ఒలింపిక్‌ జ్యోతి ర్యాలీని గణనీయంగా కుదించింది. ప్రతిసంవత్సరం గ్రీస్ లోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ ఒలింపిక్ జ్యోతి రల్ల్య్ ఉండేది. కానీ ఈ సంవత్సరం ఆ సంఖ్యను గణనీయంగా తగ్గించివేసారు.  

వచ్చే వారంలో జరుగనున్న ఒలింపిక్‌ జ్యోతి అందజేత కార్యక్రమాన్ని సైతం ఖాళీ స్టేడియంలోనే నిర్వహిస్తున్నామని, అభిమానులకు ఎటువంటి అనుమతి లేదని గ్రీస్‌ ఒలింపిక్‌ సంఘం ఆదివారం వెల్లడించింది.

Also read: కరోనా దెబ్బ: అంతర్జాతీయ క్రికెట్లో గల్లీ క్రికెట్ రూల్స్ కు వేళాయెరా!

మొత్తానికి కరోనా దెబ్బకు ఈ పరిస్థితులను చూస్తుంటే... మిగిలిన స్పోర్టింగ్ ఈవెంట్స్ మాదిరి ఒలింపిక్స్ కూడా వాయిదా పడతాయా అనే అనుమానం మాత్రం అందరి మెదళ్లలోనూ మెదులుతుంది.