కరోనా దెబ్బ: అంతర్జాతీయ క్రికెట్లో గల్లీ క్రికెట్ రూల్స్ కు వేళాయెరా!
మ్యాచును వీక్షించడానికి గ్రౌండ్ లో కరోనా దెబ్బకి అభిమానులెవ్వరు లేకపోవడంతో సిక్స్ కొట్టిన బంతిని ఏకంగా ప్లేయర్లే వెళ్లి తెచుకుంటుండడం విశేషం. ఫించ్ కొట్టిన బంతి సిక్సర్ గా వెళ్లి స్టాండ్స్ లో పడడంతో ఫెర్గుసన్ వెళ్లి బంతిని అక్కడి నుంచి తీసుకురావలిసిన పరిస్థితి ఏర్పడ్డది.
కరోనా పేరు చెబితేనే అందరూ గజగజ వణికి పోతున్నారు. పేద ధనిక అన్న తేడా లేకుండా అందరిని వణికిస్తోంది ఈ మహమ్మారి. ఈ మహమ్మారి దెబ్బకు భారత క్రీడామంత్రిత్వ శాఖ ఏకంగా ప్రేక్షకులెవ్వరు కూడా ఎటువంటి క్రీడను వీక్షించడానికి గ్రౌండ్లలోకే రాకూడదని ఆదేశాలు జారీ చేసింది.
ఇక తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ తన తొలి మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచులో కరోనా దెబ్బ మ్యాచ్ పై ఎంత ప్రభావవంతంగా ఉందొ అర్థమవుతుంది. ఈ మ్యాచులో తొలుత టాస్ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్లు కెన్ విలియమ్సన్, ఆరోన్ ఫించ్ లు ఇద్దరు కరచాలనం చేసుకున్న తరువాత ఒక్కసారిగా కరోనా గుర్తొచ్చినట్టుంది ఇద్దరు తమ తమ చేతులను వెనక్కి లాగేసుకున్నారు. ఒక్క సారిగా అక్కడ ఉన్నవారంతా పగలబడి నవ్వారు.
ఇప్పటికే ఆస్ట్రేలియా పేసర్ కేన్ రిచర్డ్సన్ కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతున్నాడు. గొంతు నొప్పి రావడంతో అతనికి కరోనావైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. దీంతో అతను న్యూజిలాండ్ తో జరిగే తొలి వన్డేకు దూరమయ్యాడు.
కేన్ రిచర్డ్సన్ ఆ విషయాన్ని జట్టు వైద్య సిబ్బందికి తెలియజేశాడు. కోవిడ్ -19కు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వైద్య నివేదిక అందాల్సి ఉంది. తొలి వన్డేకు అతని స్థానంలో సీన్ అబోట్ జట్టులోకి వచ్చాడు.
గొంతుకు సంబంధించిన ఇన్ ఫెక్షన్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారని, జట్టు సభ్యులకు రిచర్డ్సన్ ను దూరంగా ఉంచడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం జారీ చేసిన ప్రోటోకాల్ ను పాటిస్తున్నారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రతినిధి తెలిపారు.
ఇక మ్యాచును వీక్షించడానికి గ్రౌండ్ లో కరోనా దెబ్బకి అభిమానులెవ్వరు లేకపోవడంతో సిక్స్ కొట్టిన బంతిని ఏకంగా ప్లేయర్లే వెళ్లి తెచుకుంటుండడం విశేషం. ఫించ్ కొట్టిన బంతి సిక్సర్ గా వెళ్లి స్టాండ్స్ లో పడడంతో ఫెర్గుసన్ వెళ్లి బంతిని అక్కడి నుంచి తీసుకురావలిసిన పరిస్థితి ఏర్పడ్డది.
ఇక ఈ పరిస్థితులను చూస్తుంటే... మన దేశం రేపు ఆదివారం సౌతాఫ్రికాతో ఆడే మ్యాచుకు కూడా ఎవ్వరు ప్రేక్షకులను అనుమతించడంలేదు. ఈ నేపథ్యంలో ఆ మ్యాచులో కూడా బంతి స్టాండ్స్ లోకి వెళ్లిన ప్రతిసారి ప్లేయర్స్ వెళ్లి తీసుకురావడమంటే అది చాలా ఇబ్బందికర పరిస్థితి.
సాధారణ వన్డేలకే ఇలా ఉంటె... సిక్సర్ల మోత మోగే ఐపీఎల్ లో పరిస్థితులు ఎలా ఉంటాయో పెద్దగా ఊహించాల్సిన అవసరం లేదు. ఇక అప్పుడు ఫీల్డర్లను స్టాండ్స్ లో పెట్టడమో లేదా చిన్నప్పుడు గల్లీ క్రికెట్ ఆడినప్పుడు ఎవరు బాల్ కొడితే... వాడే తీసుకురావాలనే నిబంధన పెట్టడమో చేయాల్సొస్తుందేమో.