ఫ్రెంచ్ ఓపెన్ 2025 ఫైనల్లో ఐదు గంటల 29 నిమిషాల పోరులో కార్లోస్ అల్కరాస్, జనిక్ సినర్‌ను మట్టి కరిపించి టైటిల్ కైవసం చేసుకున్నాడు.

ఫ్రెంచ్ ఓపెన్ (French Open) 2025 ఫైనల్లో యువ టెన్నిస్ (Tennis) స్టార్ కార్లోస్ అల్కరాస్ అద్భుత విజయాన్ని నమోదు చేశాడు. స్పెయిన్‌కు చెందిన 21 ఏళ్ల ఈ ఆటగాడు, ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ జనిక్ సినర్‌పై విజయం సాధించి రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్‌ను గెలిచాడు. ఇది సాధారణ పోరు కాదు. ఏకంగా ఐదు గంటల 29 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలోనే అతి దీర్ఘమైన ఫైనల్‌గా నిలిచింది.

పోరు ఆరంభంలో అల్కరాస్‌కు కాస్త ఇబ్బందిగానే సాగింది. తొలి రెండు సెట్లు 4-6, 6-7 (4/7) తేడాతో సినర్ గెలుచుకుని ఆధిపత్యం చూపించాడు. అప్పటివరకు మ్యాచ్ ఒక్కదారి ప్రయాణించినట్లు అనిపించింది. కానీ ఆ తర్వాతి సన్నివేశాలు మలుపు తిప్పాయి. మూడో సెట్‌లో అల్కరాస్ 6-4తో విజయం సాధించి ఆటలోకి తిరిగొచ్చాడు.

టైబ్రేక్‌లో మళ్లీ తిరిగొచ్చి…

నాలుగో సెట్‌లోనూ ఒత్తిడిని తట్టుకుని 7-6 (7/3) తేడాతో సమం చేశాడు. ఐదో సెట్ మరింత ఉత్కంఠభరితంగా సాగింది. మొదట ఆధిక్యంలోకి వచ్చిన అల్కరాస్.. తర్వాత వెనుకబడి, కానీ చివరకు టైబ్రేక్‌లో మళ్లీ తిరిగొచ్చి 10-2 తేడాతో సెట్‌తో పాటు టైటిల్ కూడా తనవాడయ్యాడు.

ఈ విజయం ద్వారా అల్కరాస్ తన రెండో ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీని సాధించాడు. గతంలో 1982లో జరిగిన ఫైనల్ 4 గంటల 42 నిమిషాలపాటు సాగిన తర్వాత ఇదే రికార్డు బ్రేక్ చేయడం విశేషం. ప్రపంచ టెన్నిస్‌లో భవిష్యత్ తరానికి ఈ పోరు గొప్ప స్ఫూర్తిగా నిలిచేలా ఉంది.