Parenting Tips:  పిల్లలు నిద్రలో పక్క తడపడం చాలా సాధారణం. కొందరు టీనేజర్లలో కూడా ఈ అలవాటు ఉంటుంది. చాలా సందర్భాల్లో దీనికి అసలు కారణం ఏంటో తెలియదు. పిల్లల్లో ఈ అలవాటు ఎలా మాన్పించాలి?

పిల్లలు పక్క తడపడం అనేది చాలా ఇళ్లలో చూసే సాధారణ సమస్య. దీన్ని ఒక జబ్బుగా చూడాల్సిన పనిలేదు. చాలాసార్లు వయసు పెరిగే కొద్దీ ఈ అలవాటు దానంతట అదే పోతుంది. బ్లాడర్ పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం, గాఢ నిద్ర, హార్మోన్ల మార్పులు, మానసిక ఒత్తిడి లేదా మలబద్ధకం వంటివి దీనికి కారణాలు కావచ్చు.

కేవలం చిన్న పిల్లలే కాదు, టీనేజ్‌లోకి వచ్చిన కొందరిలో కూడా నిద్రలో తెలియకుండానే పక్క తడిపే అలవాటు ఉంటుంది. చాలామంది విషయంలో దీనికి సరైన కారణం ఏంటో స్పష్టంగా తెలియదు. కానీ, అనుకోకుండా జరిగే ఈ పని వల్ల పిల్లలు ఇబ్బందిగా ఫీలవుతారు. వాళ్లలో సిగ్గు, నలుగురిలో కలవలేకపోవడం, ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి సమస్యలు వస్తాయి.

ఆరేళ్లు దాటిన తర్వాత కూడా ఒక పిల్లవాడు వారానికి రెండుసార్ల కంటే ఎక్కువగా పక్క తడుపుతుంటే, ఆ పరిస్థితిని డాక్టర్లు 'నాక్టర్నల్ ఎన్యూరెసిస్' (nocturnal enuresis) అంటారు. చాలామంది తల్లిదండ్రులు, పిల్లలు బద్ధకంతోనో, టాయిలెట్‌కు వెళ్లడానికి ఇబ్బందిపడో కావాలనే పక్క తడుపుతున్నారని అపార్థం చేసుకుంటారు. కానీ నిజానికి ఇది వాళ్లు కావాలని చేసేది కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్లే ఇలా జరుగుతుంది. కొన్నిసార్లు ఏదైనా నొప్పి లేదా లోపల ఉన్న అనారోగ్య సమస్యలు కూడా దీనికి కారణం కావచ్చు.

ప్రధానంగా రెండు రకాల పిల్లల్లో ఈ సమస్య కనిపిస్తుంది. మొదటి రకం, తమ బ్లాడర్‌పై అస్సలు కంట్రోల్ లేనివాళ్లు. రెండో రకం, బ్లాడర్‌ను కంట్రోల్ చేసుకోగలరు కానీ, ఆ సమయంలో నిద్రలో ఉండటం వల్ల కంట్రోల్ కోల్పోయేవారు.

రాత్రిపూట పక్క తడిపే అలవాటును ఎలా మార్చాలి?

  • రాత్రి పడుకునే ముందు పిల్లల్ని కచ్చితంగా టాయిలెట్‌కు తీసుకెళ్లి యూరిన్ చేయించాలి.
  • రాత్రిపూట పిల్లలకు తాగడానికి ఎక్కువ నీళ్లు ఇవ్వొద్దు. అవసరమైనంత ఇస్తే చాలు.
  • పదేళ్లు దాటిన తర్వాత కూడా ఈ అలవాటు పోకపోతే, తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి. యూరినరీ ఇన్ఫెక్షన్ లేదా షుగర్ వంటి సమస్యలు ఏమైనా ఉన్నాయేమోనని పరీక్షలు చేయించాలి.
  • యూరిన్ వచ్చిన వెంటనే వెళ్లకుండా, కాసేపు ఆపుకొని ఆ తర్వాత వెళ్లడం ప్రాక్టీస్ చేయమని పిల్లలకు చెప్పాలి. ఇది బ్లాడర్ కంట్రోల్‌ను పెంచడానికి సహాయం చేస్తుంది.