- Home
- Life
- Pregnancy & Parenting
- Child Psychology: మీ పిల్లల్లో ఈ 5 లక్షణాలు ఉంటే.. మీరు సూపర్ కిడ్‍ని పెంచుతున్నట్లే!
Child Psychology: మీ పిల్లల్లో ఈ 5 లక్షణాలు ఉంటే.. మీరు సూపర్ కిడ్‍ని పెంచుతున్నట్లే!
ప్రతి తల్లిదండ్రులకి తమ పిల్లలు ప్రత్యేకంగా ఉండాలి, జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవాలి అనే కోరిక ఉండటం సహజం. అయితే చిన్నప్పటి నుంచే పిల్లల్లో కనిపించే కొన్ని లక్షణాలు వారి భవిష్యత్ ప్రతిభకు సంకేతమని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

Child Psychology
ఏ పేరెంట్స్ అయినా తమ పిల్లలు తెలివిగా, ఆత్మవిశ్వాసంతో ఎదగాలని కోరుకుంటారు. అయితే కొన్ని ప్రత్యేక లక్షణాలు చిన్నప్పుడే కనిపిస్తే, అవి భవిష్యత్తులో అసాధారణ ప్రతిభకు సంకేతాలని నిపుణులు చెబుతున్నారు. సైకాలజీ నిపుణుల ప్రకారం కొంతమంది పిల్లల్లో కనిపించే కొన్ని అలవాట్లు, లక్షణాలు వారు “సూపర్ కిడ్”గా ఎదగబోతున్నారని సూచిస్తాయి. ఇవి చదువులోనే కాదు.. వారి ఆలోచనా విధానం, ప్రవర్తన, సృజనాత్మకత, భావోద్వేగ నియంత్రణ వంటి అంశాల్లో కూడా కనిపిస్తాయి.
ప్రశ్నలు అడగడం
సైకాలజీ ప్రకారం మీ పిల్లలు తరచూ “ఎందుకు?”, “ఎలా?” ఇది చేస్తే ఏమవుతుంది? వంటి ప్రశ్నలు అడుగుతుంటే, అది వారి మెదడు చురుకుగా పనిచేస్తోందని సంకేతం. ఇలాంటి పిల్లలు కొత్త విషయాలు నేర్చుకోవడంలో ముందుంటారు.
సృజనాత్మకత
డ్రాయింగ్ వేయడం, కథలు చెప్పడం, కొత్త కొత్త ఆలోచనలు చేయడం వంటి విషయాల్లో మీ పిల్లలు ఆసక్తి చూపితే, అది వారి ఊహాశక్తి బలంగా ఉందని అర్థం. ఈ లక్షణం భవిష్యత్తులో ఇన్నోవేషన్‌కు దారి తీస్తుంది.
పరిష్కారం కనుక్కోవడం
నిపుణుల ప్రకారం.. కొందరు పిల్లలు సమస్య వచ్చినప్పుడు వెంటనే సహాయం అడగకుండా పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటారు. అలా సమస్య గురించి ఆలోచించి పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నించే పిల్లలు భవిష్యత్తులో స్వతంత్రంగా ఆలోచించే నాయకులుగా ఎదుగుతారని నిపుణులు చెబుతున్నారు.
భావోద్వేగ అవగాహన
ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం, సానుభూతి చూపించడం వంటి లక్షణాలు ఉన్న పిల్లలు సామాజికంగా విజయవంతం అవుతారు. ఇది మంచి నాయకత్వ లక్షణాలకు పునాది వేస్తుంది.
పట్టుదల
ఒక పని మొదలుపెట్టిన తర్వాత అది పూర్తయ్యే వరకు కష్టపడటం, విఫలమైతే మళ్లీ ప్రయత్నించడం వంటి లక్షణాలు ఉన్న పిల్లలు జీవితంలో పెద్ద విజయాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
నిపుణుల ప్రకారం, IQ కంటే కూడా ఈ పట్టుదల, శ్రమించే తత్వం ఎక్కువగా ప్రభావం చూపుతుంది. పిల్లల్లో ఈ లక్షణాలను గుర్తించడం మాత్రమే కాదు, వాటిని ప్రోత్సహించడం కూడా తల్లిదండ్రుల బాధ్యత.

