దాదాపు అన్నిచోట్ల స్కూల్స్ ప్రారంభమయ్యాయి. చాలామంది పిల్లలు ఉదయాన్నే తొందరగా లేవరు. రెడీ కారు. అలాంటి వారిని రెడీ చేసి స్కూల్ కి పంపించడం అంత ఈజీ పనేం కాదు. అయితే కొన్ని చిట్కాలతో పిల్లల్ని స్కూల్ కి ఈజీగా రెడీ చేయచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం.
పిల్లల్ని స్కూల్‌కి రెడీ చేయడం అంటే చిన్న విషయమేమి కాదు. ఇన్ని రోజులు ఇంట్లో మంచిగా ఆడుకున్న పిల్లలు.. ఇప్పుడు స్కూల్ కి వెళ్లాలంటే కాస్త అయిష్టంగానే ఉంటారు. దానికితోడు చాలా స్కూళ్లు ఉదయం 8 నుంచి 9 గంటలకే మొదలవుతాయి. ఇక వ్యాన్ కి వెళ్లే పిల్లలు అరగంట, గంట ముందుగానే రెడీ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఈలోపే పేరెంట్స్ అన్నీ రెడీ చేయాల్సి ఉంటుంది.
అంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఉదయాన్నే లేపి బ్రష్ చేయించి, స్నానం చేయించాలి. వారికి యూనిఫాం వేసి సాక్స్ వేసి, షూస్ వేసి, పిల్లలకి టిఫిన్ పెట్టి, వారి కోసం బాక్స్ సిద్ధం చేయాలి. బ్యాగ్‌లో బుక్స్ పెట్టాలి. ఇవన్నీ చేసి పిల్లల్ని స్కూల్ వ్యాన్ ఎక్కించేసరికి చిన్నపాటి యుద్ధం చేసిన ఫీలింగ్ వస్తుంది.
ఇది ప్రతి ఇంట్లోనూ రోజూ రిపీట్ అయ్యే సీన్. ఈ పనిలో ఎక్కువ శ్రమ పడేది మాత్రం తల్లులే. వారు అందరికంటే ముందుగానే లేచి ఫుడ్ ప్రిపేర్ చేస్తేనే పిల్లలు టైంకి స్కూల్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి మనం ఈ వంట పని చేసేలోపు పిల్లలు వారంతట వారే రెడీ అయితే బాగుండు అనిపిస్తుంటుంది చాలామంది తల్లులకు. మరి పిల్లలు వారంతట వారే ఎలా రెడీ కావాలో.. అందుకు వారిని ఎలా ప్రిపేర్ చేయాలో ఇక్కడ చూద్దాం.
మనం సోషల్ మీడియాలో పిల్లలకు సంబంధించిన వీడియోలు చూస్తూనే ఉంటాం. చాలామంది చిన్న పిల్లలు వారంతట వారే రెడీ అయిపోయి స్కూళ్లకు వెళ్తుంటారు. అంతేకాదు వారి పేరెంట్స్ కి కూడా కొన్ని విషయాల్లో హెల్ప్ చేస్తుంటారు.
పిల్లలు ఇలాంటి పనులను చేస్తుంటే వారి పేరెంట్స్ సరదాగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అవి వైరల్ కూడా అవుతుంటాయి. అలాంటివి చూసినప్పుడు మన పిల్లలు కూడా అలాగే రెడీ అయితే కాస్త పని తప్పేది కదా అని అనిపిస్తుంటుంది. మరి పిల్లల్ని అలా.. ఎలా రెడీ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
స్కూల్‌కి పంపే ముందు పిల్లలకి నేర్పించాల్సిన విషయాలు
పిల్లల్ని స్కూల్‌కి పంపే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్పించడం చాలా అవసరం. ఇది వాళ్లకి స్వతంత్రంగా, సురక్షితంగా ఉండడానికి సహాయపడుతుంది. సమాజంలో మెళితం కావడానికి ఉపయోగపడుతుంది.
స్వయం శుభ్రత
పళ్లు తోముకోవడం, మొహం కడుక్కోవడం, గోళ్లు కత్తిరించుకోవడం వంటివి నేర్పించండి. బట్టలు వేసుకోవడం, షూ లేసులు కట్టుకోవడం కూడా నేర్పండి. టిఫిన్ చేయడం, ప్లేటు శుభ్రం చేసుకోవడం లాంటివి నేర్పడం ద్వారా మీరు లేకపోయినా వారిపని వారు చేసుకునే అవకాశం ఉంటుంది.
సమాజంలో మెలగడం
ప్లీజ్, థాంక్యూ, సారి లాంటి పదాలు నేర్పించడం మర్చిపోవద్దు. ఈ పదాలను ఎలాంటి సందర్భాల్లో వాడుతారో వివరిస్తే… ఇవి వారిని ఇతరులతో కలిసిమెలసి ఉండేలా చేసేందుకు సహాయపడతాయి.
సురక్షితంగా ఉండడం
రోడ్డు దాటేటప్పుడు రెండు వైపులా చూడడం, జీబ్రా క్రాసింగ్ వాడడం నేర్పండి. తెలియని వాళ్లతో మాట్లాడకూడదని.. వాళ్ల దగ్గర ఏమీ తీసుకోకూడదు అని చెప్పండి. దానివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని తెలియజేయండి. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే టీచర్‌కి లేదా పేరెంట్స్ కి చెప్పాలని ముందుగానే నేర్పించడం మంచిది.
స్వతంత్రంగా, బాధ్యతగా ఉండడం
స్కూల్ కి వెళ్లేటప్పుడు తమ బ్యాగ్ తామే సర్దుకోవడం, కావాల్సిన వస్తువులు ఉన్నాయో లేదో చూసుకోవడం వంటివి పిల్లలకు కచ్చితంగా నేర్పించాలి. సమయానికి పడుకోవడం, నిద్ర లేవడం, తినడం, స్కూల్‌కి రెడీ కావడం నేర్పిస్తే మీపై పనిభారం కూడా కొంచెం కొంచెంగా తగ్గుతుంది.
మానసికంగా సిద్ధం చేయడం
స్కూల్ అంటే చాలా సరదాగా ఉంటుంది. అక్కడికి హ్యాపీగా వెళ్లాలి. చక్కగా చదువుకోవాలి. తిరిగి వచ్చాక మంచిగా ఆడుకోవచ్చు అని పిల్లలకు చెప్పండి. అప్పుడు వారు సంతోషంగా స్కూల్ కి వెళ్తారు. ఏదైనా బాధగా ఉంటే టీచర్‌కి లేదా పేరెంట్స్‌కి చెప్పుకోవాలని నేర్పాలి.
ఈ చిట్కాలు పాటిస్తే మీ పిల్లల్ని ఈజీగా స్కూల్‌కి సిద్ధం చేయవచ్చు. వాళ్లు బాగా ఎదగడానికి సహాయపడవచ్చు.
